భార్యపై అనుమానంతో ..భర్త ఆత్మహత్యా యత్నం

భార్యపై అనుమానంతో  ..భర్త ఆత్మహత్యా యత్నం

సికింద్రాబాద్​లో ఘటన

పద్మారావునగర్​, వెలుగు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త..  ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య పనిచేసే షాపులో ఒంటిపై పెట్రోల్​ పోసుకొని, నిప్పంటించుకోగా 98 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి కండిషన్​సీరియస్​గా ఉన్నది. ఈ ఘటన సికింద్రాబాద్​లో ఆదివారం జరిగింది.  స్థానికుల వివరాల ప్రకారం.. 

మౌనిక,  శ్రావణ్ (37) దంపతులు. సికింద్రాబాద్​ ప్యాట్నీ సెంటర్​ లోని కామాక్షి సిల్క్స్​ క్లాత్​ షోరూమ్​ లో మౌనిక జాబ్​ చేస్తున్నది. అయితే, భార్య పై అనుమానం పెంచుకున్న శ్రావణ్​ ఆదివారం మధ్యాహ్నం షాప్​కు వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. తిరిగి సాయంత్రం షాప్​కు  పెట్రోల్​ బాటిల్ తో వచ్చాడు. కస్టమర్లు ఉన్న సమయంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు.  

దీంతో షాక్​ తిన్న కస్టమర్లు దుకాణం నుంచి పరుగులు తీశారు. పక్కనే ఉన్న బట్టలకు మంటలు అంటుకున్నాయి. ఫైర్​ సిబ్బంది అక్కడికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్​ను వెంటనే 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు అతడికి అత్యవసర ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. దాదాపు 98 శాతం శరీరం కాలిపోయినట్టు క్యాజువాలిటీ మెడికల్​ఆఫీసర్​ తెలిపారు. శ్రావణ్​ పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.