- అశ్వారావుపేటలో ఘటన
అశ్వారావుపేట, వెలుగు : కుటుంబ కలహాలతో తన భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అశ్వారావుపేటకు చెందిన కృష్ణ (23), రమ్య ( 20) మూడు సంవత్సరాల క్రితం పట్టణంలోని మద్దిరావమ్మ గుడి సెంటర్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి కృష్ణ తన తల్లి నాగమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టి ఇరువురికి సర్ది చెప్పారు. అప్పటి నుంచి కృష్ణ తాపీ పనికి వెళుతుండగా రమ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 16 రోజుల క్రితం తల్లి నుంచి వేరుపడి కృష్ణ దంపతులు వేరే ఇంట్లో కాపురం పెట్టారు. గురువారం నాగమ్మ తన కొడుకుకి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె తన కొడుకు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లింది.
లోపలి నుంచి తలుపులు వేసి ఉండటం గమనించి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపులు బద్దలు కొట్టి చూశారు. కొడుకు ఉరివేసుకొని కనిపించగా కోడలు మంచంపై అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ కరుణాకర్, ఎస్సై శివరామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమ్య మెడపై గాయాలు ఉన్నాయి. అలాగే మంచంపై గాజులు పగిలిపోయి ఉన్నాయి. కృష్ణ తన భార్యను చంపి భయపడి ఆ తర్వాత ఉరివేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రమ్య మూడు నెలల గర్భిణి.