భార్యను తల్చుకుంటూ భర్త ఆత్మహత్య 

  • కొడుకు లేడని ఆగిన తల్లి గుండె
  • కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో విషాదం 
  • 24 గంటల వ్యవధిలో రెండు మరణాలు

కరీంనగర్(తిమ్మాపూర్), వెలుగు : భార్య చనిపోవడంతో కలత చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా..కొడుకు మృతిని తట్టుకోలేని ఆ తల్లి గుండె ఆగి మరణించింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నేదునూరుకు చెందిన బొల్లంపల్లి కనకయ్య, కనకలక్ష్మి దంపతులకు నలుగురు బిడ్డలు, కొడుకు శ్యామ్ సుందర్(35) ఉన్నారు. శ్యాంసుందర్ ఆర్కెస్ట్రాలో సింగర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన శారదతో గత ఏడాది మే 15న శ్యామ్​కు పెండ్లయ్యింది.

కొద్దికాలం బాగానే ఉన్నా కుటుంబ కలహాలతో శారద పుట్టింటికి వెళ్లింది. సెప్టెంబర్ 20న హుస్నాబాద్ లోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఎడబాటును తట్టుకోలేని శ్యాంసుందర్ అప్పటినుంచి దిగాలుగా ఉంటున్నాడు. తన పెండ్లి రోజును గుర్తు చేసుకుంటూ మే14న అర్ధరాత్రి అతడి భార్య ఉరివేసుకొని చనిపోయిన చెట్టు దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో అతడి తల్లి కనకలక్ష్మి తల్లడిల్లింది. రోజంతా గుండెలవిసేలా రోదించింది. శ్యాంసుందర్ అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటికి వచ్చింది. అతడినే తల్చుకుంటూ కుమిలిపోయింది.  రాత్రి 11 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది.  24 గంటల వ్యవధిలో తల్లీ కొడుకు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.