గడ్డిమందు తాగి భర్త ఆత్మహత్య.. అనారోగ్యంతో భార్య అదేరోజు మృతి

  • పెద్దపల్లి జిల్లాలో ఘటన

సుల్తానాబాద్, వెలుగు : భార్యాభర్తలు ఒకే రోజు మరణించి మరణంలోనూ బంధాన్ని చాటుకున్నారు. ఈ విషాద ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలోని యాదవ నగర్ కు చెందిన గెల్లు రాజమల్లు (70) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య మల్లమ్మ (65) కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించింది. రాజమల్లు కుడి కాలికి గాయమై ఇన్‌ఫెక్షన్​ అయింది.  దీంతో కాలిని సగం తీసేశారు. ఆయన భార్య మల్లమ్మ కూడా అనారోగ్యంతో బాధపడుతోంది.

గత నెల 30న ఆమెకు సీరియస్ గా ఉండడంతో పిల్లలు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఏమైందో ఏమో రాజమల్లు శుక్రవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ లోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా శనివారం తెల్లవారుజామున ఆయన చనిపోయాడు. అప్పటికే అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లమ్మ కూడా శనివారమే మరణించింది.