పెనుబల్లి, వెలుగు : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త.. పెండ్లి బట్టలు ధరించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామానికి చెందిన పేటేటి వెంకటేశ్వరరావు (27) కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని సీతానగరం కాలనీకి చెందిన లక్ష్మితో ఏడేండ్ల క్రితం పెళ్లయింది. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
వెంకటేశ్వరరావు మద్యానికి బానిసై భార్యతో గొడవపడేవాడు. పలుమార్లు కులపెద్దలు పంచాయితీ నిర్వహించారు. అయినా అతను మద్యం మానకపోవడంతో నెల క్రితం అతని భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఇంటికి రావాలని పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినా రాకపోవడంతో ఇక తన భార్య తిరిగి రాదని వెంకటేశ్వరరావు మనస్తాపం చెందాడు. మద్యం తాగి పెండ్లి బట్టలు వేసుకుని శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.