- మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ
- పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్
- హయత్ నగర్ లో పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన
ఎల్బీనగర్,వెలుగు : వివాహిత ఆత్మహత్య ఘటనలో హయత్నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన రమావత్ శివకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన సుజాత అలియాస్ దివ్య(24)తో 2023లో పెండ్లి అయింది.
అనంతరం వీరు సిటీకి వచ్చి హయత్ నగర్ డివిజన్ బంజారాకాలనీలో ఉంటుండగా.. ఆరునెలల కిందట పాప పుట్టింది. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేనప్పుడు దివ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త శివనే చంపేసి, సూసైడ్ గా చిత్రీకరించాడని ఆరోపిస్తూ దివ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి గొడవ జరిగే చాన్స్ ఉండగా పోలీసులు వెంటనే డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
స్టేషన్ వద్ద ఇరువర్గాల గొడవ
పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని, కూతురు డెడ్ బాడీ ఎక్కడుందో కూడా చెప్పడం లేదని తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దివ్య మృతికి ఆమె భర్త, అత్తమామనే కారణమని ఆరోపించారు. అదనపు కట్నం తేవాలని ఎన్నో సార్లు తమ కూతురును వేధించినట్టు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాలు మాట్లాడుకోవా లని పోలీసులు సూచించారు.
దీంతో శివపై మృతురాలి బంధువులు దాడికి యత్నించగా.. ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలను బయటకు పంపించగా కొంతసేపు తోపులాట జరిగింది. దీంతో పోలీసులకు, మృతురాలి బంధువులకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్టేషన్ పై దాడి చేసినట్టు వచ్చిన వార్తలు సరికాదని, ఎవరూ దాడి చేయలేదని ఇన్ స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.