సూర్యాపేట, వెలుగు: భర్తను భార్య హత్య చేసిన ఘటన సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐ సురేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట మండలంలోని హనుమనాయక్ తండాకు చెందిన ధరావత్ కౌసల్య, అదే తండాకు చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన వివాహేతర సంబంధానికి భర్త ధరావత్ సైదా అడ్డుగా ఉన్నాడని, ఎలాగైన తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఆగస్టు 29న భర్త సైదా తాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే అదునుగా భావించి భర్తను భార్య గొడ్డలితో నరికి హత్య చేసింది. అనంతరం భర్త తాగి వచ్చి చెక్క బల్ల అంచుపై పడి చనిపోయాడని అందరినీ నమ్మించింది.
తండ్రి హత్యను చిన్న కొడుకు వినోద్ చూడగా, ఈ విషయం బయట తెలిస్తే తను జైలుకు పోతానని, ఎవరీ చెప్పొద్దని వేడుకుంది. అందుకు వినోద్ భయపడి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈనెల 22న కౌసల్య తన చిన్న కొడుకు వినోద్ తో గొడవ పెట్టుకుంది. దీంతో వినోద్ తన తండ్రిని అమ్మే హత్య చేసిందని అన్న సాయికుమార్ తో చెప్పాడు. ఈనెల 23న సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో సాయికుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ బాలూనాయక్.. డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సీఐ సురేందర్ రెడ్డితో కలిసి విచారణ చేపట్టారు. మంగళవారం ధరావత్ కౌసల్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.