మెదక్  జిల్లాలో భార్య కళ్లెదుటే భర్త మృతి

మెదక్  జిల్లాలో భార్య కళ్లెదుటే భర్త మృతి
  • ..బైక్​ను బస్సు ఢీకొనడంతో ప్రమాదం
  • గంటన్నర తర్వాత వచ్చిన అంబులెన్స్
  • కొన ఊపిరితో కొట్టుకుని ఆలోపే మృతి
  • మెదక్  జిల్లాలో తూప్రాన్ పరిధిలో ఘటన 

శివ్వంపేట, వెలుగు : భార్య కళ్లెదుటే భర్త మృతి చెందిన విషాదకర ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.  పోలీసులు తెలిపిన  ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన వెంకటేశ్(40), సుమలత దంపతులు మంగళవారం తూప్రాన్ ఆస్పత్రిలో బంధువులను పరామర్శించేందుకు బైక్ పై వెళ్తున్నారు. నర్సాపూర్–- తూప్రాన్ ​రోడ్డుపైన దొంతి శివారులో గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ ఆర్డీసీ డిపో బస్సు ఎదురుగా వచ్చి బైక్ ను ఢీ కొట్టి ఆగింది.

దీంతో వెంకటేశ్ బైక్ పై నుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడాలని భార్య రోదిస్తూ ప్రయాణికులను వేడుకుంది. అంబులెన్స్ కు కాల్ చేయగా గంటన్నర  తర్వాత రావడంతో అప్పటికే వెంకటేశ్ చనిపోయాడు. రోడ్డుపై విగత జీవిగా పడి ఉన్న భర్త డెడ్ బాడీపై పడి భార్య రోధించిన తీరును చూసి ప్రయాణికులు కూడా కంటతడి పెట్టారు. అంబులెన్స్ టైమ్ కు రాకపోవడంతోనే చనిపోయినట్టు మృతుడి భార్య, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు.