ఖమ్మంలో విషాద ఘటన.. మొన్న భార్య, నిన్న భర్త సూసైడ్

  • చికిత్స పొందుతూ మృతి
  • భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఘటన

పినపాక/మణుగూరు, వెలుగు : భార్య ఆత్మహత్య తట్టుకోలేక ఒకరోజు వ్యవధిలోనే భర్త కూడా పురుగుల మందు తాగి సూసైడ్  చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఉప్పాక గ్రామంలో జరిగింది. సాయికుమార్, స్వప్న భార్యాభర్తలు. ఇద్దరిదీ వేర్వేరు కులాలు. పెద్దలను ఒప్పించి ప్రేమ పెండ్లి చేసుకున్నారు. స్వప్న ఆరు నెలల గర్భిణి. ఏమైందో ఏమో బుధవారం మధ్యాహ్నం ఆమె తమ ఇంట్లో ఉరేసుకొంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయం తట్టుకోలేక భర్త సాయి కుమార్​ (27) తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను పురుగుల మందు తాగాడు.

ఖమ్మంలోని ఓ ప్రయివేటు హాస్పటల్​లో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్న ఈ దంపతులు పెండ్లయిన తొమ్మిది నెలలకే అత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. కాగా, తన ఆత్మహత్యకు ఓ లేడీ డాక్టర్  కారణమంటూ సాయికుమార్​  తన చేతి మీద రాసుకున్నాడని తెలుస్తోంది. మరోవైపు స్వప్న ఆత్మహత్యకు సాయికుమార్​ వేధింపులే కారణమని ఆమె బంధువులు ఏడూళ్లబయ్యారం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అలాగే సాయికుమార్​ మృతికి  లేడీ డాక్టరే కారణమని  మృతుడి తల్లి హైమావతి మణుగూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మణుగూరు సీఐ రమాకాంత్​ తెలిపారు.