
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం మూడో డివిజన్ జయనగర్ కాలనీ 17వ స్ట్రీట్ లో నివాసముంటున్న భూక్య పార్వతి(43) ఆదివారం తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మృతురాలి తమ్ముడు భూక్య రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా పనిచేసే తన బావ భూక్య సీతారాములు, అక్కను హత్యచేసి పారిపోయినట్లు ఆరోపించాడు. శనివారం రాత్రి అక్క, బావ మధ్య ఘర్షణ జరిగినట్లు చుట్టుపక్కల వారు చెప్పారన్నాడు. బావ సీతారాములుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చిందని, అనుమానంతో జయనగర్ లోని ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా అక్క నేలపై పడి మృతి చెంది కనిపించిందని తెలిపాడు. వెంటనే డయల్ 100 కు కాల్ చేసినట్లు చెప్పాడు. 20 ఏండ్లుగా పార్వతిని నిత్యం అనుమానిస్తూ, వేధింపులకు గురిచేసేవాడని ఆరోపించాడు. ఎన్నోసార్లు పంచాయితీలు పెట్టించి సర్ది చెప్పి బావ సీతారాములుతో, అక్కను పంపేవాళ్లమని తెలిపాడు. మృతురాలికి ఇద్దరు సంతానం. ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తోపులాటలో భర్త సీతారాములు, భార్య పార్వతిని బలంగా నెట్టివేయడంతో తలకు సోఫా ఉడ్ బలంగా తగిలి రక్తం కారి చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఖానాపురం హావేలి పీఎస్ సీఐ హరి, ఎస్సై స్వప్న ఘటన స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.