భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

  • వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని ఘాతుకం

ఖమ్మం టౌన్, వెలుగు :  వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త.. తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలం శివాయిగూడెం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వీరన్నకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అతను తన భార్యాపిల్లలను వదిలి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను మూడు నెలలు క్రితం వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. వీరన్న భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదుతో రఘునాథపాలెం పోలీసులు వీరన్నను స్వగ్రామానికి తిరిగి రప్పించారు. వారం కింద పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసి భార్యాభర్తలను కలిపారు. ఈ క్రమంలో భార్యపై వీరన్న అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతోందని ఆమెను అనుమానించాడు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి. శనివారం కూలికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన ఆదిలక్ష్మిని ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావని అడిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. దీంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. భార్యను నరికి చంపిన తర్వాత నిందితుడు వీరన్న.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఖమ్మం ఏసీపీ రామకృష్ణ, సీఐ శ్రీధర్  ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మేరకు రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.