- చౌటుప్పల్ పీఎస్ పరిధిలో ఘోరం
చౌటుప్పల్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపిందో భార్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఆఫీసులో ఏసీపీ మొగులయ్య వివరాలు తెలియజేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల తండాకు చెందిన రమావత్ వెంకటేశ్వర్లు అలి యాస్ శ్రీను తన భార్య సరోజతో కలిసి కొన్నేండ్ల నుంచి చౌటుప్పల్ లో ఉంటున్నాడు. వెంకటేశ్వర్లు స్థానికంగా ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తుండగా, భార్య అక్కడే జొన్న రొట్టెలు అమ్ముతోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన మాతంగి మహేశ్..చౌటుప్పల్ లోనే ఓ కోళ్ల ఫామ్ లో పని చేస్తున్నాడు. జొన్న రొట్టెల కోసం తరచూ వచ్చే మహేశ్‌కు సరోజతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వెంకటేశ్వర్లుతో కూడా మహేశ్ స్నేహం చేశాడు.
కొద్ది నెలల క్రితం మహేశ్, సరోజ సంబంధం బయటపడడంతో వెంకటేశ్వర్లు ఇద్దరినీ హెచ్చరించాడు. తమకు అడ్డొస్తున్న వెంకటేశ్వర్లును చంపాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈనెల రెండో తేదీన భర్త ఇంట్లో ఉండగా సరోజ..మహేశ్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి వెంకటేశ్వర్లు గొంతుకు తాడు బిగించి చంపేశారు. డెడ్‌బాడీని ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాపై పడేసి మహేశ్పరారయ్యాడు. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి విచారణలో సరోజపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా తన ప్రియుడితో కలిసి భర్తను చంపినట్టు ఒప్పుకుంది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ దేవేందర్, ఎస్సై యాదగిరి, ఎస్సై ధనుంజయ పాల్గొన్నారు.