సానుభూతికి కోసం సూసైడ్ డ్రామా
గోకుల్ ఫ్లాట్స్లో ఘోరం
హైదరాబాద్, వెలుగు: ఇష్టం లేని పెండ్లి చేశారని భార్యని హత్య చేశాడు ఒక యువకుడు. మేనకోడలిని చంపి.. సానుభూతి కోసం తాను సూసైడ్ చేసుకోబోయినట్లు డ్రామా ఆడాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ లో ఈ ఘోరం జరిగింది. ఎస్ఐ రవికిరణ్ తెలిపిన ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాతచెరువు గ్రామానికి చెందిన కె.రాజేశ్వరి తన భర్త ఆదినారాయణతో కలిసి 15 ఏండ్ల కిందట సిటీకి వచ్చి గోకుల్ ఫ్లాట్స్ లో ఉంటున్నారు. ఆదినారాయణ ఎలక్రషియన్. రాజేశ్వరి తమ్ముడు మొత్తె యాగతయ్య అలియాస్ యోగి(25 ) టెన్త్ ఫెయిల్ అయ్యి కొన్నేళ్ల కిందట వాళ్లదగ్గరకు వచ్చాడు. అక్క ఇంట్లోనే ఉంటూ బావతో కలిసి ఎలక్ట్రికల్ వర్క్స్ కి వెళ్తున్నాడు. రాజేశ్వరి మరో సోదరి రమణ తమ కూతురు అరుణ అలియాస్ గాయత్రి(22)ని యాగతయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. అతడికి ఇష్టం లేకపోయినా కుటుంబసభ్యులు కలిసి ఒప్పించారు. ఈ ఏడాది మే 13న పాతచెరువులో పెండ్లి జరిగింది. యాగతయ్య 20 రోజుల కిందటే భార్యను తీసుకుని గోకుల్ ఫ్లాట్స్ లోనే మరో ఇంట్లో అద్దెకు దిగాడు. రోజూ తాగొచ్చి భార్యను కొడుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అతడి ఇంటి పక్కన ఉన్న మహిళ యాగతయ్య గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడని రాజేశ్వరికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె 100కి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి యాగతయ్యతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న అరుణను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అరుణ మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. యాగతయ్య చికిత్స పొందుతున్నాడు. విచారణలో తానే భార్యను గొంతు నులిమి చంపినట్లు అతడు ఒప్పుకొన్నాడు. ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతోనే హత్యచేసినట్టు చెప్పాడు. ఆ తర్వాత సానుభూతి కోసం ఆత్మహత్యాయత్నం చేసినట్టు నటించానని పేర్కొన్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.
For More News..