కొడుకు పుట్టలేదన్న కోపంతో భార్యను చంపిన భర్త

కొడుకు పుట్టలేదన్న కోపంతో భార్యను చంపిన భర్త
  •  ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలంలో ఘటన
  • కుటుంబ కలహాలతో ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో మరో హత్య

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు :కొడుకు పుట్టడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి, ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం‌‌‌‌ వంజిరిలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన డోకే జయరాంకు భీంబాయి అనే మహిళతో గతంలో వివాహం జరుగగా.. కూతురు పుట్టింది. కొడుకు కావాలన్న ఆశతో జయరాం జగన్నాథపూర్‌‌‌‌కు చెందిన పోచు బాయి (42)ని రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. దీంతో అసహనానికి గురైన జయరాం మగ పిల్లాడు లేడన్న కోపంతో తరచూ ఇద్దరు భార్యలతో గొడవ పడేవాడు. 

ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా పోచు బాయితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన జయరాం పక్కనే ఉన్న పలుగుతో పోచుబాయి తల, నుదుటిపైన కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ పోచుబాయి అక్కడికక్కడే చనిపోయింది. గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌‌‌‌ ఎస్సై సందీప్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతిరాలి తల్లి రాజు బాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. 

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో...

గుడిహత్నూర్, వెలుగు : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌‌‌ మండలంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన లట్‌‌‌‌పటే మారుతికి, అదే గ్రామానికి చెందిన కీర్తి (28)తో 2012లో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మారుతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా మారుతి తీరు మార్చుకోకపోవడంతో కీర్తి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లింది. నాలుగు రోజుల కింద అత్తగారింటికి వెళ్లిన మారుతి కీర్తితో మాట్లాడి ఇక నుంచి మంచిగా ఉంటానని నచ్చజెప్పాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కీర్తి తాగునీరు తీసుకొచ్చేందుకు సమీపంలో ఉన్న నల్లా వద్దకు వెళ్లింది. ఈ టైంలో అక్కడే ఉన్న మారుతి కత్తితో కీర్తి మెడపై నరికాడు. 

తల్లితో పాటే వచ్చిన కూతురు కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే మారుతీ పరార్‌‌‌‌ అయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కీర్తిని స్థానికులు రిమ్స్‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. కీర్తి తండ్రి సూర్యకాంత్‌‌‌‌ ముండే ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భీమేశ్‌‌‌‌, ఎస్సై మహేందర్‌‌‌‌ తెలిపారు.