
హాలియా, వెలుగు: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరాటిగూడెంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేరాటిగూడెం గ్రామానికి చెందిన దూపల్లి కిరణ్, అరుణ (35) దంపతులు కిరాణ దుకాణం నడుపుతూ జీవిస్తున్నారు. కిరణ్ మద్యానికి బానిసగా మారడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
సోమవారం కూడా కిరణ్ మద్యం తాగడంతో భార్య అరుణ గొడవ పడింది. మద్యం మత్తులో ఉన్న కిరణ్ కత్తితో అరుణను పొడిచి హత్య చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అరుణ అక్కడికక్కడే చనిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అన్న మేకల యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గుర్రంపోడ్ ఎస్సై పసుపులేటి మధు చెప్పారు.