మళ్లీ ఆడపిల్లే పుడుతదేమోనని .. నిండు గర్భిణిని నడిరోడ్డుపై వదిలేశాడు

మళ్లీ ఆడపిల్లే పుడుతదేమోనని .. నిండు గర్భిణిని నడిరోడ్డుపై వదిలేశాడు
  • ఇద్దరు ఆడపిల్లలతో భార్యను పుట్టింటికి పంపిన భర్త
  • పెండ్లి టైంలో పెట్టిన సామాన్లు రివర్స్
  • అత్తాపూర్ పీఎస్​ పరిధిలో అమానవీయ ఘటన

 గండిపేట, వెలుగు: మూడోసారి కూడా ఆడపిల్లే పుడుతుందనే అనుమానంతో నిండు గర్భిణిగా ఉన్న భార్యను నడిరోడ్డుపై వదిలేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ అమానవీయ ఘటన  అత్తాపూర్‌‌ పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌‌నగర్‌‌కు చెందిన అక్బర్‌‌ఖాన్‌‌ ఏసీ టెక్నీషియన్. ఇతనికి ఐదేండ్ల కింద సులేమాన్​నగర్​కు చెందిన హుమేరా బేగంతో పెండ్లి జరిగింది. పెండ్లి తర్వాత వీరు చాంద్రాయణగుట్టలోని బాబానగర్​లో కాపురం పెట్టాడు. తొలి కాన్పులో హుమేరా బేగం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ టైంలో ఆడపిల్లను కన్నావా అంటూ ఆమెపై భర్తతోపాటు అత్తమామలు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితురాలు రెయిన్‌‌బజార్‌‌ పీఎస్​లో ఫిర్యాదు చేసింది.

 ఆ తర్వాత గొడవలు సద్దుమణగడంతో భార్యభర్తలు కలిసే ఉంటున్నారు. రెండో కాన్పులోనూ హుమేరా బేగంకు ఆడపిల్లే పుట్టింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. మూడోసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భర్త అక్బర్​ఖాన్​ఆమెను కొంతకాలంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అదనపు కట్నం తేవాలని, మరోసారి ఆడపిల్ల పుడితే పరిస్థితి ఏంటని ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 26న రాత్రి పెండ్లికి పెట్టిన సామాన్లతోపాటు భార్య, ఇద్దరు పిల్లలను ఆటోలో తీసుకెళ్లి సులేమాన్​నగర్ లోని అత్తగారింటి వద్ద నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు మంగళవారం అత్తాపూర్​పీఎస్​లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.