కౌన్సిలింగ్ సెంటర్లోనే..పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి

సికింద్రాబాద్, వెలుగు: భార్యతో గొడవల నేపథ్యంలో పోలీసు స్టేషన్​కు కౌన్సిలింగ్​కు​వచ్చిన భర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బేగంపేట మహిళా పోలీసుస్టేషన్​ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. అడ్డగుట్టకు చెందిన అఖిల్​(28), సరిత(24) భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల కిందట పెండ్లి జరగ్గా, కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో.. సరిత బేగంపేట మహిళా పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

దీంతో ఇద్దరి మధ్య సయోద్య కుదుర్చేందుకు పోలీసులు కౌన్సిలింగ్​నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా ఇద్దరు  కౌన్సిలింగ్​రావడంతో  సీఐ వారికి కౌన్సిలింగ్​నిర్వహించారు. ఈ సమయంలో అఖిల్​తనను మాటి మాటికి కౌన్సిలింగ్​పేరుతో స్టేషన్​కు పిలిపిస్తున్నారంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్​ఒంటిపై పోసుకొని నిప్పంటిచుకున్నాడు. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని కోటుకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అనంతరం స్వల్పంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు.