
- మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన
తూప్రాన్, వెలుగు : డబ్బుల విషయంలో గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి కర్రతో భార్య తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతురాజుపల్లిలో సోమవారం జరిగింది. తూప్రాన్ సీఐ రంగకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అశోక్, అతడి భార్య శివకాళి (35) మూడు నెలల కింద పోతురాజుపల్లికి వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు.
డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన అశోక్ డబ్బుల విషయంలో సోమవారం మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన అశోక్ పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో శివకాళి అక్కడికక్కేడ చనిపోయింది. గమనించిన పక్క పోర్షన్ వారు ఇంటి ఓనర్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇంటి ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ రంగా కృష్ణ తెలిపారు.