విడాకులు ఇస్తలేదని ..  సుపారి ఇచ్చి భార్యను చంపించిండు

విడాకులు ఇస్తలేదని ..  సుపారి ఇచ్చి భార్యను చంపించిండు
  • మంచిర్యాల హత్య కేసులో వెలుగుచూస్తున్న నిజాలు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం  హత్యకు గురైన బత్తిని శరణ్యను ఆమె భర్త జియా ఉల్ హక్ ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి చంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీఐఎస్ఎఫ్ మధురై యూనిట్ లో పనిచేస్తున్న జియా ఉల్​ హక్​ ఇటీవల మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా తన ఫ్రెండ్ తో కలిసి శరణ్య మర్డర్ కు ప్లాన్ చేసినట్టు సమాచారం. 2012లో లవ్ మ్యారేజ్ చేసుకున్న శరణ్య, జియా ఉల్​హక్​కు మధ్య విభేదాలు రావడంతో ఐదేండ్ల నుంచి  విడిగా ఉంటున్నారు. మంచిర్యాల కోర్టులో డైవోర్స్ ​కేసు పెండింగ్ లో ఉంది.

డైవోర్స్ ​ఇవ్వడానికి శరణ్య నిరాకరించడంతోనే ఆమె హత్యకు ప్లాన్​ వేసినట్టు తెలుస్తోంది. శరణ్యను చంపితే రూ.10 లక్షలు ఇస్తానని ఇద్దరికి ఒప్పుకున్నట్టు సమాచారం. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఐదు స్పెషల్ టీంలతో అన్ని కోణాల్లో ఎంక్వయిరీ చేస్తున్నారు. సుపారీ మర్డర్​గా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు మధురైలో ఉన్న జియా ఉల్ హక్ ను అదుపులోకి తీసుకోవడానికి టీంను పంపినట్టు తెలిసింది. అన్ని వివరాలు నిర్ధారించుకున్న తర్వాత నిందితుల అరెస్టు చూపే అవకాశముంది.