
- భార్యకు గుండెపోటు వచ్చిందని డ్రామా
- డెడ్‌బాడీ సొంతూరుకు తరలిస్తుండగా అనుమానంతో తిరిగి రప్పించిన పోలీసులు
- న్యూ మలక్‌పేటలో ఘటన
- భార్యను తలపై కొట్టడంతో ఘట్కేసర్లో మహిళ మృతి
మలక్ పేట/ఘట్కేసర్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని వేర్వేరు చోట్ల భర్తల దాడిలో ఇద్దరు భార్యలు హత్యకు గురయ్యారు. న్యూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో 32 ఏండ్ల శిరీష చనిపోగా.. ఘట్ కేసర్ పరిధిలోని ఏదులాబాద్ లో 52 ఏండ్ల అనురాధ ప్రాణాలు కోల్పోయింది. న్యూమలక్పేటకు చెందిన సింగం వినయ్ కుమార్, శిరీష దంపతులు. వీళ్లు జమున టవర్స్‌లోని ఫ్లాట్ నంబర్ 106లో నివాసం ఉంటున్నారు. 2017లో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఐదేండ్ల కూతురు ఉన్నది. శిరీష ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్‌గా పని చేస్తున్నది. వినయ్ కుమార్ మెడికల్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగి.
అయితే, శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆమె మేనమామ మధుకర్‌కు వేరే ఫ్రెండ్ ద్వారా ఆదివారం వినయ్ సమాచారం అందించాడు. మధుకర్ ఇంటికి చేరుకునేలోపే శిరీషను వినయ్ కుమార్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆ వెంటనే శిరీష డెడ్‌బాడీతో వినయ్ కుమార్ అంబులెన్స్‌లో సొంతూరైన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు బయల్దేరాడు. మధుకర్ జమున టవర్స్‌లోని ఫ్లాట్‌కు వెళ్లగా.. శిరీష చనిపోయిందని తెలిసింది.
శిరీష డెడ్‌బాడీ చూపించకపోవడంతో మధుకర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ డ్రైవర్ నంబర్ సేకరించి ఫోన్ చేసి డెడ్‌బాడీని వెనక్కి తీసుకురావాలని చెప్పారు. శిరీష ముఖం, మెడపై గాయాలు ఉండటంతో మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శిరీష మృతిని పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.
వినయ్, అతని కుటుంబ సభ్యులే చంపేశారు
శిరీషను వినయ్, అతని కుటుంబ సభ్యులే చంపేశారని ఆమె మేనమామ మధుకర్ ఆరోపించారు. శిరీషను వినయ్ కుమార్ ఎప్పుడూ వేధించేవాడని తెలిపాడు. శిరీష ఎవరితో ఫోన్లో మాట్లాడినా అనుమానించేవాడని అన్నాడు. శిరీష పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారని, ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆమెను దత్తత తీసుకుని చదివించారని తెలిపాడు. ఉస్మానియాలో ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసి ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పని చేస్తున్నదని వివరించాడు. అక్కడే పనిచేసే వినయ్ కుమార్ అక్క సరిత ద్వారా శిరీషకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందన్నారు. 2017లో పెండ్లి చేసుకున్నారని తెలిపారు. వినయ్ కుమారే.. శిరీషను గొంతు నులిమి హత్య చేశాడని ఆమె బావ సునేంద్ర ఆరోపించాడు.
ఏదులాబాద్‌లో అనుమానంతో మరొకరు..
ఘట్కేసర్లోని ఏదులాబాద్ గ్రామానికి చెందిన ఎదుగని శ్రీనివాస్, అనురాధ దంపతులు. వీరికి కూతురు మానస ఉంది. కొడుకు పూర్ణచందర్ ఐదేండ్ల కింద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. శ్రీనివాస్ మద్యానికి బానిసై ఏ పని చేసేవాడు కాదు. అనురాధ క్యాటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్.. ఆమెతో గొడవపడేవాడు. ఫిబ్రవరి 28న అనురాధతో గొడవపడటంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి.
మరుసటి రోజు ఆమెను ఘట్కేసర్ లోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున చనిపోయింది. డెడ్‌బాడీని ఏదులాబాద్‌లోని తన ఇంటికి తీసుకెళ్లగా.. భర్త శ్రీనివాస్, కూతురు మానస వెంట రాలేదు. అనుమానించిన అనురాధా సోదరుడు కాలేరు నర్సింగ్ రావు.. ఇంట్లో వెళ్లి చూడగా వస్తువులు, ఫర్నిచర్ చిందరవందరగా పడి ఉన్నాయి. శ్రీనివాస్ దాడి చేసి అనురాధను చంపినట్లు ఆరోపించాడు. నర్సింగ్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.