సిద్దిపేట జిల్లాలో మళ్లీ కుండపోత

సిద్దిపేట జిల్లాలో మళ్లీ కుండపోత
  • నీట మునిగిన హుస్నాబాద్, కోహెడ​
  • కట్టుకాల్వ ఉదృతితో జలదిగ్బంధంలో కాలనీలు
  • మునిగిన ఇండ్లు, దుకాణాలు

 హుస్నాబాద్/ సిద్దిపేట/కోహెడ,వెలుగు: వెలుగు : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాల్లో  బుధవారం తెల్లవారుజామున 2.30 నుంచి ఉదయం 10 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోహెడలో 27 సెంటిమీటర్లు, హుస్నాబాద్ లో  14.64 సెంటిమీటర్ల వర్షం కురవడంతో కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదనీరు ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. హుస్నాబాద్ లో మెయిన్  రోడ్డు, బస్టాండ్, అంబేద్కర్​ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో రోడ్లకు ఇరువైపులా నీరు నిలిచి చెరువులా మారాయి. హుస్నాబాద్​, తోటపల్లిలో పిడుగులు పడి రెండు గేదెలు చనిపోయాయి. వర్షాలతో హుస్నాబాద్​ డివిజన్​లో 104 ఇండ్లు పాక్షికంగా కూలిపోయినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.  పందిల్ల వద్ద రోడ్డు తెగిపోయింది.  దీంతో సిద్దిపేట -హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ మండల కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ మను చౌదరి, సీపీ అనురాధ పర్యటించారు. దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి బాధితులతో  మాట్లాడి భరోసా ఇచ్చారు.
జిల్లాలో 54.7 మిల్లీ మీటర్ల వర్షం
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం 54.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  కోహెడలో అత్యధికంగా 27 సెంటీ మీటర్ల వర్షం కురయగా, ,నంగునూరులో129.6, హుస్నాబాద్ లో 114.6 ,బెజ్జంకిలో 92,కొండపాకలో 84.4,దుల్మిట్టలో 76.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకు చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.  బెజ్జంకి మండలం  గాగిల్లాపూర్ గ్రామంలోని ఎస్సీ  కాలనీలోని10 ఇండ్లు వరద నీటితో  నిండిపోయి నిత్యావసర వస్తువులన్నీ తడిసిపోయాయి.