
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్ టికెట్ ఖాయమనుకున్న అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ప్రస్తుతం పొన్నం ప్రభాకర్రూపంలో పోటీ తయారైంది. కరీంనగర్‌ను కాదని ఆయన హుస్నాబాద్ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకొని పొన్నం షాక్ ఇవ్వగా, పొత్తుల్లో భాగంగా ఈ సీటు తమకే కేటాయించాలని సీపీఐ తరఫున చాడ వెంకట్‌రెడ్డి కోరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తులపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాకున్నా.. హుస్నాబాద్ సీటు కోసం ముగ్గురు నేతలు పోటీపడ్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది.
టికెట్‌పై హామీతోనే సొంత గూటికి అల్గిరెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో కాంగ్రెస్ తరఫున హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గెలుపొందారు. 2014లో ఓడిపోగా, 2018 ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కారణంగా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తర్వాత ప్రవీణ్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినా ఇటీవలే సొంత గూటికి చేరుకున్నారు. హుస్నాబాద్ టికెట్‌పై హామీతోనే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్‌కు తిరిగివచ్చినట్లు తెలుస్తోంది. ములకనూరు సొసైటీ అధ్యక్షునిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న ప్రవీణ్ రెడ్డి బరిలో ఉంటే కాంగ్రెస్ విజయం ఖాయమనే అంచనాలున్నాయి.
ములకనూరు సొసైటీని విజయవంతంగా నడుపుతున్న పేరుతో పాటు విస్తృత ప్రజా సంబంధాలు ఆయనకు కలిసివచ్చే అంశం. ఈ క్రమంలో ఆయన గడపగడపకు కాంగ్రెస్ పేరుతో కొంతకాలంగా నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, కష్టనష్టాల్లో పార్టీని నమ్ముకొని ఉన్న పొన్నం ప్రభాకర్‌ను కాదని అల్గిరెడ్డికి టికెట్ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
పాత క్యాడర్‌తో టచ్‌లోకి చాడ
పునర్విభజనకు ముందు ఇందుర్తి నియోజకవర్గం సీపీఐకి కంచుకోట. కానీ క్రమంగా ఆ పార్టీ ప్రాభవం కోల్పోతూ వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉండడంతో ఈసారి బరిలో నిలిచి, గెలవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి ఆశిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐకి హుస్నాబాద్సీటు అడగవచ్చని భావించినా సీఎం కేసీఆర్కమ్యూనిస్టులకు ఆ చాన్స్ ఇవ్వలేదు.
దీంతో ఇప్పుడు కామ్రేడ్స్ చూపు కాంగ్రెస్‌పై పడింది. కాంగ్రెస్ కూడా పొత్తులకు సానుకూలంగా ఉండడం, ఇటీవల ఆ దిశగా చర్చలు జరగడంతో పొత్తుల్లో హుస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో చాడ వెంకటరెడ్డి పాత క్యాడర్‌తో టచ్‌లోకి వెళ్తున్నారు. టికెట్ మనకే వస్తుందని, అలర్ట్ చేస్తుండడం ఆసక్తిరేపుతున్నది.
బీసీ ఓట్లపై పొన్నం గురి
కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. హుస్నా బాద్ సీటును ఎంచుకోవడానికి ఇక్కడ అత్యధికం గా ఉన్న బీసీ ఓట్లే కారణమని తెలుస్తున్నది. నిజానికి కొన్ని రోజులుగా హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభా కర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వర్గీయులు ఇదంతా ఉత్త ప్రచారం అని కొట్టిపారేశారు. కానీ ఇటీవల హుస్నా బాద్ టికెట్ కోసం పొన్నం అప్లికేషన్ పెట్టుకోవడం తో అల్గిరెడ్డి వర్గీయుల్లో టెన్షన్ మొదలైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పొన్నం ఓటమి పాలయ్యారు.
ఈ ఎన్నికల్లో ఆయనకు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీసీలు తనకు సపోర్ట్ చేయడమే ఇందుకు కారణమని పొన్నం భావిస్తున్నారు. నియోజకవర్గం లో మొత్తం 2.30 లక్షల ఓటర్లు ఉండగా, 50 శాతా నికి పైగా బీసీలే ఉన్నారు. వీరిలో పొన్నం సామా జికవర్గానికి చెందిన గౌడ్‌లకు దాదాపు 30 వేల ఓట్లు ఉన్నాయి. దీంతో హుస్నాబాద్‌పై పొన్నం ఫోకస్ పెట్టారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.