
- ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన కలెక్టర్
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మచెరువును టూరిస్టు ప్లేస్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ మనుచౌదరి ఇరిగేషన్అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎల్లమ్మచెరువును పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, చెరువు విస్తీర్ణం, నీటి సామర్థ్యం, ఆయకట్టు వివరాలను ఈఈ రాములును అడిగి తెలుసుకున్నారు.
చెరువుకట్ట సుందరీకరణలో భాగంగా లైటింగ్ సిస్టమ్, లేజర్ లైట్లు, మ్యూజిక్ ఫౌంటెన్ సిస్టమ్, ఓపెన్ జిమ్, బోటింగ్‌తోపాటు పర్యాటకులను ఆకట్టుకునే ఇతర పనులు, వసతులపై ఎస్టిమేట్ చేసి నివేదిక ఇవ్వాలని ఈఈ రాములుతోపాటు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ విద్యాసాగర్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హుస్నాబాద్‌లో కొత్తగా నిర్మించిన డిగ్రీ కాలేజీ భవనాన్ని పరిశీలించారు. కాలేజీలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, ఏయే కోర్సులు ఉన్నాయని ప్రిన్సిపాల్ భిక్షపతిని అడిగి తెలుసుకున్నారు.
కాలేజీలో ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ ఇతర పెండింగ్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మెడికల్ కాలేజీ నిర్మాణానికి హనుమకొండ రూట్లో అధికారులు సేకరించిన 30 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట హుస్నాబాద్ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.