హుస్సేన్ సాగర్ బాణాసంచా ప్రమాదం.. బోట్లలో చిక్కుకున్న ఏడుగురు.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

హుస్సేన్ సాగర్ బాణాసంచా ప్రమాదం.. బోట్లలో చిక్కుకున్న ఏడుగురు..  ముగ్గురికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో జరిగిన బాణాసంచా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న గాంధీ ఆసుపత్రితో పాటు యశోద, సరోజినీ దేవి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో ‘భారత మాత పౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భరత మాత మహా హారతి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లలో అపశృతి చోటుచేసుకుంది.

హుస్సేన్ సాగర్లో రెండు బోట్లలో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రమాదవశాత్తు దగ్ధమైంది. దీంతో హుస్సేన్ సాగర్లో ఉన్న రెండు బోట్లలో ఉవ్వెత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో రెండు బోట్లు దాదాపుగా కాలిపోయాయి. బోటులో జరిగిన బాణాసంచా ప్రమాదంలో ఏడు మంది నిర్వాహకులు చిక్కుకోగా.. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు వ్యక్తులకు బాణాసంచా పేలుడు ధాటికి తీవ్ర గాయాలు కాగా కళ్లకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బోట్లలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.

ALSO READ | భరతమాత ‘మహా హారతి’లో అపశృతి.. హుస్సేన్ సాగర్లో కాలి బూడిదవుతున్న రెండు బోట్లు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని ‘భారత మాత ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమం జరిగింది. ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, నాగఫణిశర్మ తదితరులు హాజరయ్యారు.