
- గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
- ప్రమాదం జరిగిన చోటే 15 ఫీట్ల లోతులో కూరుకుపోయిన బాడీ
- 3 రోజుల పాటు గాలించి మృతదేహాన్ని వెలికితీసిన డీఆర్ఎఫ్ బృందాలు
- యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా కన్నుమూత
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద భారతమాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా పటాకులు పేలి బోట్లు దగ్ధమైన ఘటనలో ఇద్దరు చనిపోయారు. బోట్లు కాలిపోయినపుడు అజయ్ (21) అనే యువకుడు హుస్సేన్ సాగర్ లో పడి గల్లంతయ్యాడు. అతని కోసం గాలిస్తుండగా డెడ్‌బాడీని డీఆర్ఎఫ్ బృందాలు మంగళవారం గుర్తించాయి. అజయ్ కోసం డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టూరిజం విభాగాల సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు గాలించాయి. ప్రమాదం జరిగిన చోటే అజయ్ డెడ్‌బాడీ లభ్యమైంది. 15 అడుగుల లోతులో బురదలో అతని మృతదేహం కూరుకుపోయింది. అతని కోసం గాలిస్తుండగా డీఆర్ఎఫ్ బోటు కొక్కేలకు బాడీ తగిలింది. మృతదేహాన్ని బయటకు లాగి అదనపు బృందంతో కలిసి సంజీవయ్య పార్క్ వైపు తీసుకొచ్చారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమయం అయిపోవడంతో బుధవారం పోస్టుమార్టం చేయనున్నారు. అలాగే, 80 శాతం కాలిన గాయాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి కూడా మంగళవారం ఉదయం చనిపోయాడు. గణపతిది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా. అతని మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఏపీకి తరలించారు.
చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు
మేడ్చల్ జిల్లా నాగారానికి చెందిన జానకిరాం, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. రెండో కొడుకు అజయ్.. కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. జానకిరామ్ ఆటో నడుపుతూ అజయ్ ను బీటెక్ చదివిస్తున్నాడు. కొన్ని రోజుల్లో చదువు పూర్తయితే తమను చూసుకుంటాడు అనుకుంటున్న టైంలో అజయ్ చనిపోయాడు. అతని మృతదేహాన్ని చూసి తల్లి నాగలక్ష్మి తల్లడిల్లిపోయింది. ‘‘చదువు పూర్తయితదని, ఉద్యోగ అవకాశాలు వస్తున్నయని, బాధలు తప్పుతయని అనేటోడు. చివరకు మమ్మల్ని విడిచిపోయినవ్” అంటూ తల్లి రోదించింది. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆమెను చూసి కంటతడి పెట్టుకున్నారు. బంధువులు, మిత్రులు, గీతాంజలి కాలేజీ స్టూడెంట్లు పెద్ద ఎత్తున హుస్సేన్‌సాగర్ వద్దకు తరలివచ్చారు.
కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలి: చేనేత చైతన్య వేదిక
బోట్లు దగ్ధమైన ఘటనకు పూర్తి బాధ్యత భారతమాత ఫౌండేషన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకోవాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్క దేవదాసు డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి వెంటనే అజయ్ కుటుంబాన్ని పరామర్శించి రూ.కోటి పరిహారం చెల్లించాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. లేకపోతే హైదరాబాద్ లో ఆయనను తిరగనివ్వబోమని హెచ్చరించారు. మంగళవారం రాత్రి గాంధీ హాస్పిటల్ మార్చురీ వద్ద పద్మశాలీ నాయకులతో కలిసి దావేదాసు ఆందోళనకు దిగారు. కిషన్‌రెడ్డి వచ్చే వరకు అజయ్ మృతదేహాన్ని అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. కిషన్‌రెడ్డి రాకుంటే మృతదేహాన్ని ఆయన ఇంటికే తీసుకెళ్తామన్నారు.