అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధం

అశ్వారావుపేట, వెలుగు: అగ్ని ప్రమాదంలో ఓ పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని ఆసుపాకలో మంగళవారం జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్టం మారప్ప  కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ పొయ్యి వద్ద మంటలు చెలరేగి పైకి ఎగసిపడ్డాయి. కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీస్తూ చుట్టుపక్కల వారిని పిలిచేసరికే మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధం కావడంతో మారప్ప కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఫైర్ అధికారులు పక్క ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు.