పోలీసు విధులకు ఆటంకం.. కౌశిక్​రెడ్డిపై కేసు నమోదు

 పోలీసు విధులకు ఆటంకం.. కౌశిక్​రెడ్డిపై కేసు నమోదు

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు సైబరాబాద్ అడ్మిన్ ఏడీసీపీ రవిచందన్​రెడ్డికి వేలు చూపిస్తూ అంతూ చూస్తానని బెదిరించిన హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున సీపీ ఆఫీస్​కు తరలివచ్చారు.

ఈ క్రమంలో ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సైబరాబాద్ అడ్మిన్ ఏడీసీపీ రవి చందన్​రెడ్డికి వేలు చూపెడుతూ నీ అంతు చూస్తానని బెదిరించి చాతిపై చెయ్యి వేసి కౌశిక్​ రెడ్డి వెనక్కి నెట్టివేశాడు. దీంతో ఏడీసీపీ రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు కౌశిక్​రెడ్డిపై 132, 351(3) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

కౌశిక్​రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఫిర్యాదు

ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి తమను బెదిరించి, రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశాడని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని బీఆర్ఎస్​ లీడర్ కృష్ణచైతన్య గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కౌశిక్​రెడ్డి విసిరిన సవాల్​ను స్వీకరించిన అరికెపూడి గాంధీతో కలిసి గురువారం మధ్యాహ్నం తాము కొండాపూర్​లోని ఎ మ్మెల్యే కౌశిక్​రెడ్డి ఇంటికి చేరుకున్నామని, అక్కడ కౌశిక్​రెడ్డి తన అనుచరులతో తమను బండబూతులు తిడుతూ దాడికి ఉసిగొల్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.