లెక్కించింది 82,450 ఓట్లు.. లెక్కించాల్సింది 1,22,786

కరీంనగర్: హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొదటి రౌండు నుండి బీజేపీ స్వల్ప ఆధిక్యంతో అధికార పార్టీకి చెమటలు పట్టిస్తోంది. అయితే ఇప్పటివరకు హుజురాబాద్, వీణవంక మండలాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.

ఇప్పటి వరకు .. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి  82 వేల 450 ఓట్లు లెక్కించగా.. ఇంకా 13 రౌండ్ల ఓట్లు.. అంటే 1,22,786 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం 10వ రౌండు నుంచి 16 రౌండు వరకు జమ్మికుంటకు చెందిన కౌంటింగ్ జరగనుంది. జమ్మికుంట మండలంలో 64,915 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 16 నుంచి 22 వరకు ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు మండలాల్లో 57,871 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే.. దుబ్బాక తరహాలో ఫలితం తేలాలంటే చివరి రౌండ్ వరకు లెక్కించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కొన్ని రౌండ్లు పూర్తయితే తప్ప మెజారిటీపై స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.