హుజూరాబాద్​ ఎలక్షన్​తో రాష్ట్ర రాజకీయాల్లో మార్పొస్తది

సుదీర్ఘ ప్రజా ఉద్యమాలు, వందలాది మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. కొంతమంది అంటున్నట్లు ఏ ఒక్కరి వల్లో లేదా ఒక రాజకీయ పార్టీ వల్లో రాష్ట్రం రాలేదు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన వర్గాలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునే లక్ష్యంతో మిగతా వారితో కలిసి సమిష్టిగా ఉద్యమంలో పోరాడటంతో దశాబ్దాల కల నెరవేరింది. కానీ ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్​ పక్కా రాజకీయ పార్టీగా మారి ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టింది. కుటుంబ పాలన సాగిస్తూ ఉద్యమ లక్ష్యాలకు, ఆకాంక్షలకు తూట్లు పొడిచింది. ఈ పరిస్థితుల్లో వచ్చిన హుజూరాబాద్​ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పనుంది. ప్రస్తుతం పరిస్థితులన్నీ టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా.. ఈటల రాజేందర్​కు అనుకూలంగా మారినట్టు కనిపిస్తున్నాయి. 


మలిదశ తెలంగాణ ఉద్యమం 2001లో మొదలైంది. టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ తెచ్చిందని చెప్పడం ఉద్యమకారులను అవమానపర్చడమే. ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, యువజన సంఘాలు జేఏసీల రూపంలో ఉద్యమాలు చేస్తే, టీఆర్ఎస్ మొదటి నుంచి ఎన్నికల చుట్టూ ఉద్యమాన్ని తిప్పింది. తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఏర్పడిందని, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే రాష్ట్రం కావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుందని ప్రజల్లో బలంగా నాటడంలో టీఆర్ఎస్ విజయవంతమైంది. రానురాను టీఆర్ఎస్​ స్వార్థపరమైన రాజకీయ ఎత్తులతో సమైఖ్య పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుంటూ ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే మారింది. ఆ పార్టీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా చూసింది. ముస్లిం ఓట్ల కోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని, మిగతా అగ్రవర్ణాలను పార్టనర్స్ గా భావిస్తూ రాజకీయాలను నడుపుతోంది.
ఉద్యమ ఆకాంక్షలను పక్కనబెట్టి..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా పక్కనబెట్టి, కుటుంబ పార్టీగా మారింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ, కరడుగట్టిన సమైఖ్యవాదులను చేరదీస్తూ కేసీఆర్ కుటుంబ పాలన సాగించడం మొదలుపెట్టారు. ఉద్యమ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ, ప్రజల అవసరాలను, ఆశయాలను బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలను రూపొందించుకోకుండా, పార్టీని, పాలనను వ్యక్తిగత అజెండా లేదా కుటుంబం చుట్టూ తిప్పుకుంటూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో స్వతంత్రంగా ఆలోచించే వారెవరికీ స్థానం లేకుండా చేశారు. తమ కుటుంబానికి బానిసలుగా ఉండే వ్యక్తులనే వివిధ స్థానాల్లో కొనసాగించారు. పార్టీలో, ప్రభుత్వంలో భిన్నాభిప్రాయం, అసమ్మతి లేకుండా అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏకపక్ష పాలన సాగిస్తున్నారు. 
ఈటలను ఓడించడమే టార్గెట్​గా..
ఈటల మొదటి నుంచి స్వతంత్ర భావాలు కలిగి ఉండటం వల్ల ఉద్యమ ఆకాంక్షలు, బలహీన వర్గాల అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరం, ప్రజాపాలన గురించి తరచుగా మాట్లాడుతుండటం కేసీఆర్​కు కంటగింపుగా మారింది. అయితే ఈటల అందరిలా కాకుండా ఒక ప్రజామోద నాయకుడుగా, తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్​ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం కేసీఆర్​కు మింగుడు పడలేదు. వాస్తవానికి ఈ సమయంలో హుజూరాబాద్​లో ఉప ఎన్నిక రావడం కేసీఆర్​కు ఇష్టం లేదు. దాన్ని వాయిదా వేయించటానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. కేసీఆర్ ను దగ్గరి నుంచి చూసి ఆయన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఈటల.. స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా, బీజేపీలో చేరి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే జాతీయ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగడంతో కేసీఆర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఆయన అహం దెబ్బతింది. మొదటిసారిగా ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అందువల్లే అనేక స్కీముల ద్వారా ఎన్ని వేల కోట్లు ఫణంగా పెట్టయినా సరే ‘ఇజ్జత్ కా సవాల్’అన్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించాలన్నదే టార్గెట్​గా 
మారింది. 
మోసపూరిత హామీలతో..
మోసపూరిత వాగ్దానాలు చేస్తూ, ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ఎస్సీ ఓట్లను గంపగుత్తగా పొందటానికి ‘దళిత బంధు’ పథకాన్ని కేసీఆర్​ ప్రకటించారు. కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి, కృష్ణమోహన్​కు బీసీ కమిషన్​ చైర్మన్ పదవి, ఇంకా అనేక మందికి రాష్ట్రస్థాయి పదవులు, బీసీ విద్యార్థి నాయకునికి పార్టీ టికెట్టు, ఇక పాతవి, కొత్తవి, ఆగినవి, ఇక రావనుకున్నవి ఇలా అన్ని స్కీములను అమల్లోకి తెస్తున్నట్లు భ్రమల్లో పెట్టడం మొదలు పెట్టారు. గోబెల్స్ తరహాలో మీడియాలో ప్రచారం కల్పించడం ద్వారా మొత్తం పార్టీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని హుజూరాబాద్ ఎన్నికకే పగడ్బందీగా వాడుకుంటున్నారు. మొత్తం తెలంగాణ సమాజాన్ని పరోక్షంగా ఈ ఉప ఎన్నిక గురించే ఆలోచింపచేసేలా చేశారు. ఆవిధంగా అనుకోని ప్రమాదాన్ని తనకు తానే తెచ్చుకోవడం ఇప్పుడు గమనించవచ్చు.
నిరాశానిస్పృహల్లో ప్రజలు
దీనికంతటికీ కారణం ఈటల రాజేందర్ సాధారణ నాయకుడిగా కాకుండా, నిబద్ధత, సీరియస్ నెస్ కలిగిన ఉద్యమకారుడు కావడమే. బీసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడం, కమిట్మెంట్ కలిగిన వ్యక్తి కావడం, తెలంగాణలో మరీ ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టు, అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించడం అధికార పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది. బీజేపీకి రాష్ట్రంలో పుంజుకోవడానికి ఈ ఉప ఎన్నిక మంచి అవకాశంగా మారటం కూడా పోటీని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. కేసీఆర్​ గ్రాఫ్ తగ్గుతున్న తరుణంలో, రాష్ట్ర ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నిరాశలో మునిగి ఉండటం, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాలు నిస్పృహలో కూరుకుపోయి అదను కోసం చూస్తూ ఉండటం వీటన్నింటి ఫలితంగా హుజూరాబాద్​ ఎన్నిక కురుక్షేత్రంగా మారింది. 
అన్ని రంగాల్లో బీసీలకు నష్టమే
ప్రస్తుతం హుజూరాబాద్​లో ఉన్న లక్షా ఇరవై వేల ఓట్ల పైచిలుకు బీసీ వర్గాల మెదళ్లలో యుద్ధం మొదలైంది. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో బీసీలకు ఎక్కువగా నష్టమే జరిగింది. పై పై మెరుగులు దిద్దే స్వల్ప కాలిక ప్రయోజనాన్ని కలిగించే ఉపశమన కార్యక్రమాలు తప్ప బీసీ, ఎంబీసీ, సంచార జాతులకు చెందిన వారి సమస్యలను అస్సలు పట్టించుకోలేదు. సంప్రదాయ వృత్తుల్లో కొనసాగుతున్న కులాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడాల్సి వచ్చింది. బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లు అసలు పని చేయడం మానేశాయి. లోన్లు, సబ్సిడీల అప్లికేషన్లు లక్షల సంఖ్యలో మూలుగుతున్నాయి. బీసీ కమిషన్ మూలకు పడింది. గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, చేనేత చేయూత మొదలగు స్కీముల వల్ల మధ్య దళారీలే ఎక్కువ లాభపడ్డారు తప్ప అసలైన లబ్ధిదారులకు దక్కింది కొంతే. బీసీలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఆస్పత్రులు, వాటిలో సిబ్బంది నియామకం, నిధులు సమకూర్చడం, సౌకర్యాలు కల్పించడం అనేది లేనే లేదు. బీసీ సంక్షేమ బడ్జెట్లు విద్య, ఆరోగ్యం, గృహవసతి ఇలా బలహీనవర్గాలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే వ్యవస్థలకు నిధులన్నీ కుదించేశారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయన్న కల కలగానే మారింది. 

తెలంగాణ వచ్చినంక బీసీలకు సరైన ప్రాధాన్యత దక్కలేదు
మరోవైపు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు, స్కీములు, కట్టడాలు, రోడ్లు, భవనాలు, పబ్లిసిటీ కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్​ ప్రభుత్వం.. బీసీలకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. వారిని కేవలం ఎన్నికలప్పుడు గుర్తొచ్చే ఓటు బ్యాంకులుగానే భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు బీసీల మనస్సులను కలచివేస్తున్నాయనే విషయం నివురు గప్పిన నిప్పులా వ్యాపిస్తోంది. అయినా ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరం. లేదంటే బీసీలంటే ఉన్న నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా వారి గురించి పట్టించుకుని ఉండకపోవడం కూడా కావచ్చు. ఎప్పటిలాగా వారిని సులభంగా మేనేజ్​ చేయవచ్చన్న ధీమా కావచ్చు. ఈ క్రమంలోనే బీసీలకు తమకు తాము ఒక చారిత్రక నిర్ణయం తీసుకొని తమను పట్టించుకోని ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే అవకాశం వచ్చింది. ఈ పరిస్థితులన్నీ బీసీలతో పాటు అనేక సామాజిక వర్గాలను ఈటలకు అనుకూలంగా మార్చే అవకాశాలను సృష్టిస్తున్నాయి. దేశంలోనే అత్యంత కీలకమైన, ఖరీదైన ఉప ఎన్నికగా మారింది. ఇటీవల కాలంలో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఈటలకు కలిసివచ్చేదే. ఇవన్నీ చూస్తుంటే 2023 అసెంబ్లీ ఎన్నికలను శాసించే ఫలితం హుజూరాబాద్​ ఉప ఎన్నికలోనే రాబోతోందనే విషయం పోలింగ్​ దగ్గరపడుతున్న కొద్దీ బలపడుతోంది.