ప్రగతి భవన్ కేంద్రంగా హుజూరాబాద్లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజలు ఈ నీచపు కుట్రలను, కేసీఆర్ బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందన్నారు. ప్రశాంతమైన హుజూరాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఆనాడు మానుకోటలో ఉద్యమకారుల మీద రాళ్లు వేయించిన సైకోలకు ఎమ్మెల్సీ ఇచ్చారన్న ఆయన..దమ్ముంటే సమస్యల మీద మాట్లాడాలి కానీ..దొడ్డి దారిన యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు.
గజ్వేల్ లేదా హుజూరాబాద్లో కొట్లాడుదామా? అని ఈటల సవాల్ విసిరారు. దమ్ముంటే సవాలు స్వీకరించి రావాలి తప్ప చిల్లర మల్లర పనులు చేసి అల్లరి చేసే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కొందరి మాటలు నమ్మి ప్రజలు అనవసరంగా రెచ్చిపోవద్దని సూచించారు. గత 20ఏళ్లుగా హుజురాబాద్ ప్రశాంతంగా ఉందని..దీనిని చూసి ఓర్వలేని కేసీఆర్..ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
‘‘సీఎం కేసీఆర్ నా ఇళ్ళమీద రైడింగ్ చేయించారు. డబ్బులు ఇచ్చి కొంతమందితో నామీద కంప్లైంట్ చేయించి, పోస్టర్లు వేయించి..నా వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. ఉపఎన్నికలో ఎంత అల్లకల్లోలం సృష్టించినా బెదిరకుండా ప్రజలు నన్ను గెలిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలు హుజురాబాద్ వైపు ఎదురుచూస్తున్నారు వారి గౌరవం నిలబెట్టాలని నన్ను గెలిపించి పంపించారు. కేసీఆర్ దుర్మార్గాన్ని, కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ముందుకు సాగుతుంటే నామీద కుట్రలు చేస్తున్నారు’’అని ఈటల అన్నారు