- రేవంత్ ను కలిశానన్న వార్తల్లో నిజం లేదు
హుజూరాబాద్ వెలుగు : తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే ఉంటానని, రేవంత్‌ను తాను కలిసినట్లు సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో వాటిలో నిజం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ లోని సిటీ సెంట్రల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తనపై నమ్మకం ఉంచి హుజూరాబాద్ టికెట్ ఇవ్వడంతో పాటు, అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ కు నమ్మకంగా ఉంటానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనపై అభిమానం చూపించి ఓటు వేసిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పాటుపడతానని, ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని పేర్కొన్నారు.
ఏ ప్రభుత్వం ఉన్నా నియోజకవర్గానికి అవసరమైంది కొట్లాడి సాధించుకుంటానని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అముల చేసిన సంక్షేమ పథకాలు అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు కూడా అమలు చేసేలా చూస్తానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.