ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట, హుజూరాబాద్‌‌‌‌ టాప్

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో  జమ్మికుంట, హుజూరాబాద్‌‌‌‌ టాప్
  • 100 శాతం వసూళ్ల లక్ష్యం పూర్తి 
  • ఆ తర్వాతి స్థానంలో  సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌‌‌‌పల్లి పట్టణాలు
  • కరీంనగర్ సిటీలో 62 శాతమే ట్యాక్స్ వసూలు

కరీంనగర్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట, హుజూరాబాద్  మున్సిపాలిటీలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి మరో 10 రోజులు ఉండగానే  ఆయా మున్సిపాలిటీల సిబ్బంది100 శాతం పన్నులు వసూలు చేశారు. ఆ తర్వాత స్థానాల్లో సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌‌‌‌పల్లి మున్సిపాలిటీలు నిలిచాయి. మిగతా మున్సిపాలిటీల్లో ఇంకా 56 శాతం నుంచి 70 శాతంలోపే  ట్యాక్స్ వసూలైంది. ట్యాక్స్ వసూలుకు మరో 10 రోజులే గడువు ఉండడంతో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లాంటి సిటీల్లో ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్నవారికి రెడ్ నోటీసులు కూడా  ఇస్తున్నారు. మార్చి 31లోగా ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు టార్గెట్ రీచ్ కావడం కష్టంగానే ఉంది. 

హుజూరాబాద్, జమ్మికుంట ఫస్ట్.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  రెండు కార్పొరేషన్లతోపాఉట 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పరిధిలో 8,917 ఇళ్లు, వ్యాపార సముదాయాల(అసెస్ మెంట్స్) నుంచి  రూ.2.64 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. పూర్తిగా వసూలయ్యాయి. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 12,607 అసెస్మెంట్స్ నుంచి రూ.3.03 కోట్లకుగాపూ పూర్తిగా వసూలయ్యాయి.  ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో ముందుండే సిరిసిల్ల మున్సిపాలిటీ ఈసారి కాస్త వెనకబడింది. 

సిరిసిల్లలో 23,487 అసెస్‌‌‌‌మెంట్ల నుంచి రూ.6.32 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.5.60 కోట్లు(88.61 శాతం) వసూలయ్యాయి. ఆ తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో  19,195 అసెస్‌‌‌‌మెంట్ల నుంచి రూ.5.08 కోట్లకుగానూ రూ.4.18 కోట్లు(82.28 శాతం), మెట్‌‌‌‌పల్లి మున్సిపాలిటీలో 13,477 అసెస్ మెంట్ల నుంచి రూ.3.94 కోట్లకుగానూ రూ.3.16 కోట్లు(80.20శాతం), రాయికల్‌‌‌‌లో 5,380 అసెస్‌‌‌‌మెంట్ల నుంచి రూ.1.33 కోట్లు రావాల్సి ఉండగా రూ. ఒక కోటి(75.19శాతం) మేర వసూలయ్యాయి. మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే ఈ మున్సిపాలిటీలు పన్ను వసూళ్లలో  ముందంజలోనే ఉన్నాయి. 

మిగతా మున్సిపాలిటీల్లో.. 

పెద్దపల్లి మున్సిపాలిటీలో రూ.5.45 కోట్లకు గానూ రూ.3.94 కోట్లు(72.29 శాతం), వేములవాడలో  రూ.4.32 కోట్లకు రూ.3.07 కోట్లు(71.06శాతం), పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో రూ. 1.74 కోట్లకుగానూ రూ.1.21 కోట్లు(69.54శాతం), జగిత్యాల జిల్లా ధర్మపురిలో రూ.1.35 కోట్లకు గానూ రూ.82 లక్షలు(60శాతం), కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రూ.2.47 కోట్లకు రూ.1.47 కోట్లు(59.51శాతం), జగిత్యాల మున్సిపాలిటీలో 13.51 కోట్లకుగానూ రూ.7.76 కోట్లు(57.44శాతం), పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌‌‌లో రూ.2.82 కోట్లకు రూ.1.59 కోట్ల(56.38శాతం) పన్నులు వసూలయ్యాయి.

కార్పొరేషన్లలో అంతంతమాత్రమే.. 

కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లలో పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో 86,815 అసెస్‌‌‌‌మెంట్లు ఉండగా.. రూ.50.56 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.31.46 కోట్ల పన్నులు(62.22 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.19 కోట్లకుపైగా వసూలు కావాల్సి ఉంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో 50,988 అసెస్‌‌‌‌మెంట్లు ఉండగా.. రూ.15.89 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా రూ.9.60 కోట్లు(60.42శాతం) మాత్రమే వసూలైంది. ఇంకా రూ.6 కోట్లకుపైగా వసూలు కావాల్సి ఉంది.