కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణి వద్ద హుజురాబాద్ వాసులు దళితబంధు కోసం మరోసారి ఆందోళన నిర్వహించారు. దళితబంధు దరఖాస్తులతో వచ్చిన వారిని పోలీసులు లోపలికి రానీయలేదు. బయట నుంచే దరఖాస్తులు తీసుకోవడంతో..బాధితులు నిరసన వ్యక్తం చేశారు. దళితబంధు కోసం దరఖాస్తు ఇవ్వడానికి వస్తే తమను అరెస్టు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. హుజురాబాద్ వాసుల ఆందోళనతో వెనక్కు తగ్గిన పోలీసులు..ఒక్కొక్కరిని కలెక్టరేట్ లోపలికి పంపించారు. కొద్ది రోజుల క్రితం హుజురాబాద్ లోని దళితులు దళిత బంధు రాలేదంటూ..కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు. దీంతో అప్పటి నుంచి కలెక్టరేట్ ప్రజావాణి హాల్ ముందు పోలీసులు భద్రత పెంచారు.
అర్హత ఉన్నా ఇవ్వడం లేదు..
దళిత బంధు స్కీం తమకు అందలేదంటూ..సెప్టెంబర్ 13న హుజురాబాద్కు చెందిన దళితులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆందోళన చేశారు. అర్హులకు దళితబంధు ఇవ్వకుంటే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామంటూ జమ్మికుంట వాసులు ప్రజావాణి కార్యక్రమానికి పురుగుల మందు డబ్బాలతో వచ్చారు. ప్రజావాణి నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ ముందు దళిత బంధు కోసం ఆందోళనకు దిగారు. ఓట్ల కోసమే దళిత బంధు ప్రకటించారని...ఇప్పుడేమో అన్ని అర్హతలున్నా డబ్బులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.