కబ్జాలు, నిధుల గోల్‌మాల్‌పై సీఎం, మంత్రికి ఫిర్యాదు చేస్త

  • మున్సిపాలిటీలో కంప్యూటర్ లాగిన్‌లు దొంగిలించి అక్రమాలు
  • నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్‌‌నగర్‌‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఆయన అనుచరులు కంప్యూటర్​లాగిన్లను దొంగిలించి, 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని ఖాళీ స్థలాలను అధికార పార్టీ లీడర్లు కబ్జా చేస్తున్నారని, ఎమ్మెల్యే సైదిరెడ్డి కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తోందన్నారు. మున్సిపాలిటీ డాక్యుమెంట్లు గాయబ్ అవుతున్నాయని చెప్పారు.

హుజూర్‌‌నగర్ పట్టణంలోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో ఆదివారం మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. మున్సిపాలిటీలో 9 నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా అత్యవసర పనుల పేరుతో రూ.2 కోట్లను టీఆర్ఎస్ లీడర్లు, మున్సిపల్ కమిషనర్ కలిసి స్వాహా చేశారని ఆరోపించారు. భూకబ్జాలు, నిధుల గోల్‌మాల్ పై త్వరలోనే సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఏ ఫైల్ కదలడం లేదన్నారు. కమిషనర్, సబ్ రిజిస్ట్రార్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని చెప్పారు.

అక్రమంగా వెంచర్లు, రిజిస్ట్రేషన్లు

‘‘సాయిబాబా థియేటర్ వద్ద మున్సిపాలిటీకి రూ.కోట్లు విలువ చేసే 5500 గజాల ల్యాండ్ ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేను ఎమ్మెల్యేగా దిగిపోయాక ఓ రియల్టర్ ద్వారా ప్రస్తుత ఎమ్మెల్యే కేసు వేయించి ఆ భూమి కబ్జా చేయాలని చూస్తున్నారు” అని ఉత్తమ్ ఆరోపించారు. పట్టణంలోని ఓ వెంచర్‌‌లో 2 వేల గజాల ప్రభుత్వ స్థలం కూడా కబ్జాకు గురైందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 40 ఎకరాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు పెట్టి అమ్మకాలు చేస్తున్న వారికి సహకరిస్తున్న కమిషనర్‌‌పై, కుంటల్లో భూములను సైతం రిజిస్ట్రేషన్ చేస్తున్న తహసీల్దార్‌‌పై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. హుజూర్​నగర్‌‌లో జరుగుతున్న అవినీతిపై ఈనెల 30న మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.