హుజూర్ నగర్  మున్సిపాలిటీలో.. అవిశ్వాసం లొల్లి

  • తారాస్థాయికి చేరిన చైర్‌‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఆధిపత్య పోరు
  • వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైన కౌన్సిలర్లు 
  • 19 మంది సంతకాలతో అడిషనల్‌ కలెక్టర్‌‌కు నోటీసు అందజేత
  • కౌన్సిలర్లను బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

సూర్యాపేట, వెలుగు: ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్ చైర్మన్‌ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది.  వైస్‌ చైర్మన్‌ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ  చైర్మన్‌తో పాటు అధికార పార్టీకి చెందిన 12 మంది, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రెండు రోజుల కింద లోకల్ బాడీస్‌ అడిషనల్ కలెక్టర్‌ హేమంత్ కేశవ పాటిల్‌‌కు అవిశ్వాసం నోటీసులు అందజేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి అసంతృప్తి కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి ఇష్యూస్ పార్టీకి నష్టం చేస్తాయని, సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందామని నచ్చజెప్పినా.. వాళ్లు వినడం లేదు.  అవిశ్వాసం పెట్టి తీరుతామని, అందులో నెగ్గకపోతే  మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

ముందు బాగానే ఉన్నా.. 

గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సైది రెడ్డి సన్నిహితుడైన గెల్లిరవి భార్య గెల్లి అర్చన చైర్ పర్సన్‌గా,  సీనియర్ లీడర్ జక్కుల నాగేశ్వరరావు  వైస్‌ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే, చైర్ పర్సన్ మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత అక్రమ వెంచర్ల వ్యవహారంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్‌లో  వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు ఎమ్మెల్యేకు దగ్గరయ్యారు. ఇదేఅదునుగా భావించిన వైస్ చైర్మన్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.  కొన్నిరోజుల కింద ఎమ్మెల్యే, చైర్‌‌పర్సన్‌ మధ్య సంది కుదిరినా.. వైస్ చైర్మన్ అన్నీ తానై వ్యవహరిస్తుండడం ఆధిపత్య పోరుకు కారణమైంది.

ఆరోపణలు ఇవీ..

వైస్‌ చైర్‌‌ పర్సన్‌ కోదాడ రోడ్డులో శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్‌కు ఆనుకొని ఉన్న ప్రైవేట్ ల్యాండ్‌లో వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ వెంచర్‌‌లో నుంచి హుజూర్ నగర్ నేషనల్ హైవే పోయింది. దీంతో ప్రైవేట్‌ ల్యాండ్‌తో పాటు  గవర్నమెంట్ ల్యాండ్‌కు కూడా గజానికి రూ. 4500 చొప్పున 2000 గజాలకు పరిహారం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  దీనిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వీపీఆర్‌‌ వెంచర్‌‌కు సంబంధించిన మున్సిపల్ లేఅవుట్‌లోని దాదాపు రూ.3కోట్ల విలువైన 2700 గజాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాయం చేసి వెంచర్ యజమానికి అందించారన్న ఆరోపణలు ఉన్నాయి.  20 వార్డులను 28 వార్డులుగా అప్ గ్రేడ్ చేసిన తర్వాత సిబ్బందిని పెంచాలని గత  జూన్‌లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్  తీర్మానించారు.  ఇది నచ్చని వైస్ చైర్మన్ కమిషనర్‌‌ను రాత్రికి రాత్రే  బదిలీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.  అలాగే దాదాపు 50 ఎకరాల్లో వేసిన అక్రమ వెంచర్లకు సహకరిస్తూ  ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని, ఊర చెరువుకు వచ్చే వాగును పూడ్చి కబ్జా చేసినా చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిచేశారనే ప్రచారం ఉంది.  సీఎం స్పెషల్ ఫండ్స్‌ కింద చేపట్టిన రోడ్లలో నాణ్యత పాటించలేదని,  పట్టణంలోని వివాదాస్పద ప్రైవేట్ స్థలానికి చైర్ పర్సన్ కు తెలియకుండానే  నెంబర్ కేటాయించినట్లు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

కౌన్సిలర్లను  బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావడంతో అధికార పార్టీ కౌన్సిలర్లను బుజ్జగించేందుకు ఎమ్మెల్యే సైది రెడ్డి రంగంలోకి దిగారు. అవిశ్వాస తీర్మానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల ముందట ఇలాంటివి పార్టీకి మంచివి కావని ఒత్తిడి తెస్తున్నారు. కౌన్సిలర్లు మాత్రం ససేమిరా అంటున్నారు.   అవిశ్వాసం నెగ్గకపోతే  ఎమ్మెల్యేలపై మంత్రి జగదీశ్‌ రెడ్డిని కలిసి  ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.  అయినా చర్యలు లేకపోతే పదవి, పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.