హుజూర్‌‌నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తా : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌‌నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తా : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేళ్లచెరువు/నేరేడుచర్ల/మఠంపల్లి : హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పాలకవీడు, హుజూర్‌‌నగర్, మఠంపల్లి మండలాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు‌‌. పాలకవీడు మండలంలో జాన్ పహాడ్ దర్గాలో జరిగిన పూజలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ తో కలిసి పాల్గొన్నారు.

అనంతరం ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై ఆఫీసర్లతో  సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాశ్వత నిర్మాణాలు, సౌలతుల కల్పన కోసం రూ.కోటీ 11 లక్షల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. జాన్ పహాడ్ దర్గాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా దర్గా డెవలప్​మెంట్ కోసం రూ.60 లక్షలు ‌‌కేటాయించానని గుర్తుచేశారు.

జాన్ పహాడ్ లిఫ్ట్ కోసం ప్రస్తుతం రూ.173 కోట్లు మంజూరు చేశానని, ఈ లిఫ్ట్ వాడుకలోకి వస్తే10 గ్రామాల పరిధిలోని 5,650 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 34 ఎకరాల భూసేకరణ కోసం రూ.2.59 కోట్లు రైతులకు అందజేశామని చెప్పారు. ఈ లిఫ్ట్ కు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరును నామకరణం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వక్ఫ్ బోర్డ్ నిధుల నుంచి దర్గా అభివృద్ధికి రూ.30 లక్షల చెక్కును అజ్మతుల్లా హుస్సేన్ కు మంత్రి అందజేశారు.

శంకుస్థాపనల్లో బిజీ బిజీ..

హుజూర్‌‌నగర్ లోని హౌజింగ్ కాలనీ పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి స్వయంగా పరిశీలించారు‌‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు‌‌. ఇండ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శంకగా చేయాలన్నారు. రూ.14 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఐటీఐ కాలేజీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.26 కోట్లతో లింగగిరి కల్మల్ చెరువు డబుల్ రోడ్డు పనులు, రూ.23 కోట్లతో అమరవరం, అలింగాపురం డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. మఠంపల్లి మండలం లోని చౌటపల్లి నుంచి మేళ్లచెరువుకు రూ.10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు‌‌. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.