రహదారులపై అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చేస్తం : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ 

రహదారులపై అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చేస్తం : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ 

హైద‌రాబాద్ సిటీ, వెలుగు: లేఅవుట్లతో పాటు ప‌లు నివాస ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌కు ఆటంకాలు సృష్టించ‌కుండా నిర్మాణాలు ఉండాలని  హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. ఒక వేళ ఎక్కడైనా అలాంటి నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామ‌ని హెచ్చరించారు. ర‌హ‌దారుల‌కు అడ్డంగా గోడ‌లు క‌ట్టి  రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగిస్తున్నార‌ని సోమ‌వారం హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ను కూడా బై నంబ‌రు జోడించి కాజేసేస్తున్నార‌ని  ప‌లువురు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూముల‌ను కాజేస్తున్నవారి ప‌ట్ల అధికారులు క‌ఠినంగా ఉండాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. సోమ‌వారం  ప్రజావాణికి  మొత్తం 52 ఫిర్యాదులు వ‌చ్చినట్టు తెలిపారు. 

జీహెచ్ఎంసీకి193 ఆర్జీలు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను బాధ్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులకు సూచించారు. సోమవారం హెడ్డాఫీస్​లో నిర్వహించిన ప్రజావాణిలో వినతులు స్వీకరించారు.  మొత్తం 82 అర్జీలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 32, ట్యాక్స్ సెక్షన్ 9, శానిటేషన్ 6, ఇంజినీరింగ్ విభాగం 5, అడ్మినిస్ట్రేషన్, హెల్త్, ల్యాండ్ అక్విజిషన్, ఎస్టేట్స్ విభాగాలకు 3 చొప్పున వచ్చాయి.  ఆరు జోన్లలో మొత్తం 111 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 40, శేరిలింగంపల్లి జోన్ లో 22, ఎల్బీనగర్ జోన్ లో 21, సికింద్రాబాద్ జోన్ లో 18, చార్మినార్ జోన్ లో 9, ఖైరతాబాద్ జోన్ లో ఒక్క అర్జీ అందింది.