హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదలై ఐదేళ్లు పూర్తైంది. పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు మెట్రో రైల్ మంచి ఆప్షన్ అయ్యింది. అయితే ఇన్నేళ్లవుతున్నా మెట్రో రైల్ రూట్ లో ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. సామాన్యులకు మెట్రో జర్నీ ఖర్చుల భారం పెరుగుతోంది. ఇక ప్రధాన ఏరియాల్లో మెట్రో మల్టీ లెవెల్ పార్కింగ్ పై HMR ఎలాంటి ముందడుగు పడడం లేదు.
మెట్రోతో జర్నీ ఈజీ
సిటీ పబ్లిక్ జర్నీని మెట్రో రైలు ఈజీ చేసింది. పబ్లిక్ నుంచి కూడా దీనికి మంచి ఆదరణ వచ్చింది. సొంత వాహనాలున్నా ట్రాఫిక్ టెన్షన్ పడలేక.. మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు జనం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా జల్దీగా మెట్రోలో గమ్యస్థానం చేరాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంత వరకు బానే ఉన్నా మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో.. మెట్రో స్టేషన్ కు రావాలంటే సొంత వాహనాలు వినియోగించే వారు పార్కింగ్ ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారు.
వాహనాల పార్కింగ్ కీలకం
హైదరాబాద్ నగరంలో మూడు ప్రధాన రూట్లలో 67 కిలో మీటర్ల మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. మియాపూర్ నుండి ఎల్బీనగర్ కారిడార్–1లో 29 కిలో మీటర్లు, కారిడార్–2లో నాగోల్ నుండి హైటెక్ సిటీ రాయదుర్గం వరకు 28 కిలో మీటర్లు, కారిడార్–3లో జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కిలో మీటర్ల వరకు మెట్రో సర్వీసులు ఉన్నాయి. మూడు రూట్లలో మొత్తం 58 స్టేషన్లున్నాయి. రోజుకు 3.55 లక్షల మంది మెట్రోలో జర్నీ చేస్తున్నారు. వీరిలో చాలా మంది ఇళ్ల నుంచి మెట్రో స్టేషన్ వరకు సొంత వాహనాల్లో వస్తుంటారు. ఉద్యోగులతో పాటు ఇతర పనుల మీద వచ్చే వారు టూవీలర్లనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో ఆయా మెట్రో స్టేషన్ల దగ్గర వాహనాల పార్కింగ్ కీలకంగా మారింది.
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ పార్కింగ్
ప్రస్తుతం మియాపూర్, అమీర్ పేట్, ఉప్పల్, నాగోల్, ప్యారడైజ్, MGBS వంటి స్టార్టింగ్, ఎండింగ్ స్టేషన్లలో పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అందులోనూ ప్రతి స్టేషన్ దగ్గర పెయిడ్ పార్కింగ్ కావడంతో పబ్లిక్ కు చార్జీల భారం తప్పడం లేదు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో కొన్ని చోట్ల మాత్రమే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అయితే మెట్రోలో ఎక్కువ మంది ప్రయాణించేలా.. మెట్రో స్టేషన్లలో స్మార్ట్ పార్కింగ్ ఫెసిలిటిని అందుబాటులోకి తెచ్చింది HMR సంస్థ. బిడ్డింగ్ తో ప్రైవేట్ కంపెనీలతో టై అప్ అయి... పార్క్ హైదరాబాద్ పేరుతో స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు అధికారులు. మియాపూర్ టూ అమీర్ పేట్, అమీర్ పేట్ టూ నాగోల్.. మొత్తం 24 స్టేషన్స్ లో స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని అందిస్తామన్నారు. కానీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు.
రోడ్ల పైనే పార్కింగ్
నగరంలో పార్కింగ్ ఫీజులను GHMC నిషేధించింది. అయితే, మెట్రో స్టేషన్లలో కొన్ని చోట్ల తప్పించి చాలా ప్రాంతాల్లో రోడ్ల పైనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇలా రోడ్లపై వాహనాలు పెట్టి ఫీజులు వసూలు చేయడంపై మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు. రోడ్ల పొడవునా పార్కింగ్ లాట్లను ఏర్పాటు చేసి ప్రైవేటు సంస్థలకు పార్కింగ్ ఫీజు వసూళ్ల బాధ్యతను అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి
మెట్రో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో ప్రయాణికులు ఇంటి దగ్గర నుంచి మొదలై గమ్య స్థానానికి చేరుకొని.. తిరిగి ఇంటి వచ్చేలా ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు ప్రకటించారు. సొంత వాహనాలు వినియోగించకుండా కేవలం ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఉన్న ఆర్టీసీ బస్సులు, షటిల్ బస్సులు, మెర్రీ గో రౌండ్ సర్వీసులు, విద్యుత్ తో నడిచే ఆటో రిక్షాలు, క్యాబ్ లను అందుబాటులోకి తీసుకొస్తామని గొప్పగా చెప్పారు. కానీ వీటిని అమలు చేయడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలున్నాయి.