
- ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 నిమిషాల్లో 40 కిలో మీటర్లు ప్రయాణం
- అండర్ గ్రౌండ్, ఎలివేటెడ్, ఎట్ గ్రేడ్‌లో మెట్రో కారిడార్ నిర్మాణం
- డీపీఆర్ కోసం జరుగుతున్న సర్వే పనులను పరిశీలించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో పరుగులు పెట్టనుంది. అండర్ గ్రౌండ్, ఎలివేటెడ్, ఎట్ గ్రేడ్ మార్గాల్లో మెట్రో లైన్‌ను నిర్మించనున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానంలో మెట్రోను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రావిర్యాల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 18 కిలోమీటర్లు ఎట్ గ్రేడ్ (భూమి లెవల్)లో మెట్రో పరుగులు తీయనుంది. మొత్తం 22 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ హైవేను హెచ్ఎండీఏ నిర్మిస్తుంది. ఈ హైవేకు మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) వెడల్పులో మెట్రో కోసం అదే లెవెల్ భూమిని కేటాయించనున్నారు. మెట్రో ట్రాక్‌కు ఇరువైపులా మూడు లేన్ల హైవే ఉంటుంది.
మెట్రోను, హైవేను విభజిస్తూ చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. హైవేకు ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత 6 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ మెట్రో మార్గం ఉంటుంది. అనంతరం పెద్ద గోల్కొండ నుంచి ఓఆర్ఆర్ వెంట తక్కువ ఎత్తులో 14 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఎయిర్‌పోర్టు ఫ్యూచర్ సిటీ 9వ కారిడార్ డీపీఆర్ తయారీలో జరుగుతున్న సర్వే పనులను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 9 వ కారిడార్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మార్చి నెలాఖరుకు డీపీఆర్..
ఇప్పటికే నార్త్ సిటీ మెట్రోకు సంబంధించి జేబీఎస్ వద్ద ఇంటర్నేషనల్ హబ్‌ను నిర్మించనున్నట్లే.. సౌత్ సిటీలోనూ ఇంటర్నేషనల్ హబ్‌ను నిర్మించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు, శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కి.మీ., దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరకునేలా కారిడార్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీని పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ సిటీగా, ఇంటర్నేషనల్ సిటీల సరసన చేర్చాలన్నది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన తెలిపారు.