‘బ్యాడ్ బాయ్‌ బిలినియర్స్​’కు హైదరాబాద్ కోర్టు చెక్

‘బ్యాడ్ బాయ్‌ బిలినియర్స్​’కు హైదరాబాద్ కోర్టు చెక్

నెట్‌ ఫ్లిక్స్‌ పై విడుదలను ఆపివేయాలన్న కోర్టు

వెలుగు, బిజినెస్‌‌డెస్క్ : బ్యాంక్‌‌లకు వేల కోట్లు ఎగనామం పెట్టిన బిలినియర్స్​ ఆధారంగా తెరకెక్కిన ‘బ్యాడ్ బాయ్ బిలినియర్స్​’ నెట్‌‌ఫ్లిక్స్‌‌పై విడుదల అవ్వకుండా హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సత్యం స్కాండల్ బీ రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్‌‌ ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.  నలుగురు బిలినియర్స్​ విజయ్ మాల్యా, సుబ్రతా రాయ్, నీరవ్ మోడీ, రామలింగ రాజుల ఆధారంగా నెట్‌‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. వీరు వేల కోట్ల మోసం ఎలా చేశారు?  దురాశ, అవినీతి వంటి అంశాలను ప్రస్తావించింది. ఇండియా మోస్ట్ ఇన్‌‌ఫేమస్ టైకూన్లుగా ఈ డాక్యుమెంటరీ వారిని వర్ణించింది. ఈ డాక్యుమెంటరీ విడుదలపై స్టే ఆర్డర్ ఇవ్వాలని రామలింగ రాజు కోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధంగా తన ప్రైవసీకి భంగం కల్గిస్తున్నారని రామలింగ రాజు ఆరోపించారు. తన కీర్తిప్రతిష్టలను దెబ్బతీసేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని ఆయన అన్నారు.

సత్యం స్కాం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది?

2009, జనవరి 7న రూ.7 వేల కోట్ల సత్యం స్కాం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ అకౌంట్ బుక్స్‌‌ను, లాభాలను కొన్నేళ్లుగా తప్పుడుగా చూపించినట్టు రామలింగ రాజు కూడా ఒప్పుకున్నారు. కొందరు షేర్‌‌‌‌హోల్డర్స్ ఫిర్యాదు మేరకు రామలింగ రాజును రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. రాజుకు వ్యతిరేకంగా మూడు ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. వీరిపై చీటింగ్, క్రిమినల్ కుట్ర, ఫోర్జరీ, నమ్మకపు ద్రోహం వంటి కేసులు దాఖలయ్యాయి. 2015 ఏప్రిల్‌‌న స్పెషల్ సీబీఐ కోర్టు ఆయనకు, తన ఇద్దరు సోదరులకు, మరో ఏడుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నెల తర్వాత వీరికి విధించిన శిక్షలను సస్పెండ్ చేస్తూ.. బెయిల్ ఇస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశాలిచ్చింది. రామలింగ రాజు మాత్రమే కాక, ఇతర బిలినియర్స్ కూడా నెట్‌‌ఫ్లిక్స్ వెబ్‌‌ సిరీస్ విడుదలను ఆపివేయాలని కోరుతున్నారు. నెట్‌‌ఫ్లిక్స్ వెబ్‌‌ సిరీస్‌‌లో సహారా ఇండియా ఛైర్మన్ సుబ్రతా రాయ్ పేరును వాడుకోవడాన్ని బిహార్ కోర్టు కూడా వ్యతిరేకించింది. ఈ ఆర్డర్‌‌‌‌పై నెట్‌‌ఫ్లిక్స్ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

నెట్‌‌ఫ్లిక్స్‌‌కు సుప్రీం సూచన

బీహార్‌‌లో కింది కోర్టు ఇచ్చిన ఆర్డర్‌‌‌‌ను సవాలు చేస్తూ నెట్‌‌ఫ్లిక్స్ దాఖలు చేసిన అప్పీలును విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బ్యాడ్ బాయ్ బిలినియర్స్​‌‌ వెబ్‌‌ సిరీస్‌‌లో తన పేరును వాడుకోవడంపై బిజినెస్‌‌మ్యాన్ సుబ్రతా రాయ్ బిహార్ కింద కోర్టును ఆశ్రయించారు. దీంతో బిహార్ కింది కోర్టు ఈ సినిమా విడుదలపై స్టే ఇచ్చింది. దీనిపై నెట్‌‌ఫ్లిక్స్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే బిహార్ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై, పాట్నా హైకోర్టును ఆశ్రయించాలని నెట్‌‌ఫ్లిక్స్‌‌కు సుప్రీంకోర్టు తెలిపింది.

For More News..

మలింగ ఔట్‌‌.. ప్యాటిన్సన్‌‌ ఇన్‌‌

ఆర్టీసీలో జాబ్ సెక్యూరిటీ ఏది?

వానాకాలం సాగు కోటి 28 లక్షల ఎకరాలు