
ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై సమీక్షలో సీఎం వెల్లడి
37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ నిర్మాణం
320 మెగావాట్ల పవర్ ప్లాంట్
ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు మూడో టీఎంసీ
మిడ్‌మానేరు టు మల్లన్న సాగర్‌కు రెండో టీఎంసీ
అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు
రాష్ట్రంలో ఆరేడు ఇరిగేషన్ జోన్లు.. ఒక్కో జోన్‌కు ఒక్కో ఈఎన్సీ
నీటిపారుదల అధికారులకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గోదావరిలో 150 రోజులకు పైగా నీటి ప్రవాహం ఉన్న దుమ్ముగూడెం వద్ద రోజుకు 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా హైడల్ పవర్ ప్లాంట్, 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ నిర్మించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీలేరు పవర్ ప్లాంట్ ఏపీకి పోయాక తెలంగాణకు ఎక్కువ రోజులు హైడల్ పవర్ జనరేట్ చేసే ప్లాంట్ లేకుండా పోయిందని, దుమ్ముగూడెం వద్ద బ్యారేజి నిర్మిస్తే రోజుకు 320 మెగావాట్ల పవర్ జనరేట్ చేసుకోవచ్చని చెప్పారు. వీలైనంత తక్కువ భూసేకరణతో, నదిలోనే నీళ్లు ఆగేలా బ్యారేజీకి డిజైన్ చేయాలని, వెంటనే అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ బ్యారేజీ లైఫ్ లైన్ అవుతుందన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో నీటి పారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరుకు ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని పంపు చేస్తున్నారని, వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిడ్ మానేరుకు మూడు టీఎంసీలు లిఫ్టు చేసి, అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు రెండు టీఎంసీలను లిఫ్టు చేయాలన్నారు. ఈ రెండు పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకు కూడా వెంటనే టెండర్లు పిలవాలని, కంతనపల్లి బ్యారేజి పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
దుమ్ముగూడెం బ్యారేజీ, మిడ్ మానేరుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే పనులకు మొత్తం రూ.13,500 కోట్ల నుంచి రూ.14 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దుమ్ముగూడెం వద్ద హైడల్ ప్రాజెక్టు నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
గోదావరి నీరు సాగర్ ఆయకట్టుకు
కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేనప్పుడు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని కేసీఆర్ సూచించారు. మిడ్ మానేరుకు మూడు టీఎంసీల నీళ్లు వస్తాయని, కాబట్టి పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుందన్నారు. కాళేశ్వరం ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి షామీర్ పేట వాగు, మూసీ నది, ఆసిఫ్ నగర్‌కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలన్నారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ ఆన్‌లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని చేర్చాలని చెప్పారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించాలన్నారు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు, రిటైర్డు ఇంజనీర్లు త్వరలోనే ఈ ప్రాంతాల్లో పరిశీలించాలని కోరారు. గోదావరి బేసిన్‌లో మల్లన్న సాగర్ వద్ద, కృష్ణా బేసిన్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటి పారుదల శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఆరేడు ఇరిగేషన్ జోన్లు
రాష్ట్రాన్ని ఆరేడు ఇరిగేషన్ జోన్లుగా విభజించాలని, ఒక్కో జోన్ కు ఒక్కో ఈఎన్సీ ఇన్చార్జ్గా వ్యవహరించాలని, వారే నీటిపారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇకపై మేజర్, మీడియం, మైనర్ అనే తేడా లేకుండా నీటి పారుదల శాఖ మొత్తం ఒకటే విభాగంగా పనిచేయాలని సూచించారు. నీటిపారుదల ముఖ్యఅధికారులు త్వరలో రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకోవాలని, అందులో తెలంగాణ సమగ్ర నీటిపారుదల విధానాన్ని ఖరారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వర్క్‌షాప్‌లో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్టులు, చెరువులకు సంబంధించిన అన్ని వివరాలతో సమగ్ర జాబితా రూపొందించాలని తయారు చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టులు, పంపుహౌస్‌లు, లిఫ్టులు, కాల్వలు, చెరువుల నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మ్యాన్యువల్స్ ను రూపొందించాలన్నారు. సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లోనే కేటాయించనున్నట్లు వెల్లడించారు.