1971-~72 నాటి చెరువుల సర్వే మ్యాప్‌లు పరిశీలన
నివేదిక ఆధారంగా చర్యలకు హైడ్రా కసరత్తు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గొలుసుకట్టు చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో అసలు ఎన్ని చెరువులుండేవని, ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయన్న లెక్కతేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నది. మంగళవారం హబ్సిగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాయంలోని అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు. సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌ల ను పరిశీలించారు.
1971–72 సర్వే ప్రకారం.. నగరంలో ఎన్ని చెరువులున్నాయని, ఎంత విస్తీర్ణంలో ఉండేవని, ప్రస్తుతం వాటి పరిస్థతి ఎలా ఉందని, నాలాలు ఎలా ఉండేవని, ఎంత విస్తీర్ణంలో ఉండేవని, ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయన్న మ్యాప్‌లను పరిశీలించారు. దశాబ్దాల నాటి మ్యాప్‌లతో పాటు.. నేటి పరిస్థితిని పోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వివరించారు.
ఇప్పటికే హెచ్ ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాతో.. సర్వే ఆఫ్ ఇండియా వివరాలను పోల్చారు. ఈ వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులపై సమగ్ర నివేదిక తయారు చేయనున్నారు. తర్వాత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించి చర్యలను చేపట్టేందుకు హైడ్రా కసరత్తు చేస్తున్నది. మీటింగులో సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్ తదితరులు పాల్గొన్నారు.