పీపుల్స్​ ప్లాజాలో ‘స్వదేశీ మేళా’ షురూ

పీపుల్స్​ ప్లాజాలో ‘స్వదేశీ మేళా’ షురూ

ఖైరతాబాద్, వెలుగు : స్వదేశీ జాగరణ్ మంచ్‌‌‌‌, స్వావలంబి భారత్‌‌‌‌ అభియాన్‌‌‌‌ ఆధ్వర్యంలో నెక్లెస్​రోడ్​పీపుల్స్‌‌‌‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన ‘స్వదేశీ మేళా’ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్​వర్మ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ అనేది ఆర్థికపరమైన విధానం మాత్రమే కాదని.. స్వయం సమృద్ధి, దేశ ఆత్మనిర్భరతకు తారక మంత్రం అన్నారు. స్వాతంత్ర్య పోరాటం మొదలు వికసిత్​భారత్​వరకు ప్రతి అంశం స్వదేశీ ఆలోచనా విధానంతోనే ముడిపడి ఉందన్నారు. స్వదేశీ జాగరణ్ మంచ్‌‌‌‌ 30 ఏండ్లుగా స్వదేశీ మేళాలతో స్థానిక కళాకారులను, ఉత్పత్తులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఉత్పత్తులతో 350 స్టాల్స్‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 27 వరకు మేళా కొనసాగనుంది. అలాగే నిపుణ ఫౌండేషన్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్​మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి గవర్నర్ నియామక పత్రాలను అందజేశారు. నిపుణ చైర్మన్​సుభద్ర, స్వదేశీ జాగరణ్​మంచ్ జాతీయ కన్వీనర్ సుందరమ్ జీ, తెలంగాణ ప్రాంత కన్వీనర్‌‌‌‌ హరీశ్‌‌‌‌ బాబు, గంగోత్రి గ్రూప్​సంస్థల చైర్మన్​మధురామ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.