- గుండ్లపోచంపల్లి, నిజాంపేట్, సిద్దిపేటకూ అవార్డులు
- దేశంలో క్లీనెస్ట్ సిటీగా ఏడోసారీ ఇండోర్ టాప్
- ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని క్లీనెస్ట్ సిటీల్లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఏడోసారీ మొదటి స్థానంలో నిలిచింది. 2023 ఏడాదికి గాను ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డుల్లో గుజరాత్ లోని సూరత్ తో కలిసి ఇండోర్ అగ్రస్థానాన్ని పంచుకుంది. నవీ ముంబై తన మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక టాప్ టెన్ లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సిటీలు చోటు దక్కించుకున్నాయి. విశాఖపట్నం 4, విజయవాడ 6, తిరుపతి 8, హైదరాబాద్ 9వ స్థానాల్లో నిలిచాయి. గురువారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యూఏ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. క్లీన్ సిటీస్, క్లీనెస్ట్ కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్, బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ కేటగిరీలలో టాప్ త్రీలో నిలిచిన సిటీలకు అవార్డులు ఇచ్చారు.
నేషనల్ లెవల్ లో 24, జోనల్ లెవల్ లో 20, స్టేట్ లెవల్ లో 54 విభాగాల్లో కలిపి మొత్తం 110 అవార్డులను అందజేశారు. లక్ష లోపు జనాభా కలిగిన సిటీల కేటగిరీలో సస్వాద్ (మహారాష్ట్ర), పటాన్ (చత్తీస్ గఢ్), లోనావాలా (మహారాష్ట్ర) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మధ్యప్రదేశ్ లోని మోవ్ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా ఎంపికైంది. క్లీనెస్ట్ గంగా సిటీల్లో వారణాసి, ప్రయాగ్ రాజ్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2023 డాష్ బోర్డును రాష్ట్రపతి ముర్ము ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో రాష్ట్రాలు, అర్బన్ లోక్ బాడీస్(యూఎల్ బీ) పనితీరును ప్రశంసించారు. ‘‘వ్యర్థాల నుంచి సంపదను సృష్టించాలనే అంశాన్ని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ‘వేస్ట్ టు వెల్త్’ థీమ్ పై అందరూ ఆలోచించాలి. ఇది మొత్తం పరిశుభ్రతకు దోహదపడుతుంది” అని అన్నారు.
సౌత్ జోన్ లో నాలుగింటికి మూడు మనకే..
లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో క్లీనెస్ట్ సిటీగా హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది. దీంతో పాటు మన రాష్ట్రానికి మరో 3 అవార్డులు కూడా వచ్చాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీల్లో సౌత్ జోన్ లో మొత్తం నాలుగు అవార్డులకు గాను మూడు మనకే దక్కాయి. 15–-25 వేల మధ్య జనాభా ఉన్న కేటగిరీలో గుండ్లపోచంపల్లి క్లీన్ సిటీగా నిలిచింది. 25-–50 వేల మధ్య జనాభా ఉన్న కేటగిరీలో నిజాంపేట్, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న కేటగిరీలో సిద్దిపేట క్లీన్ సిటీ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేతుల మీదుగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమ భారత్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు. కాగా, హైదరాబాద్ కు అవార్డు దక్కడంపై జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని అవార్డులు రావాలని ఆకాంక్షించారు.