హైదరాబాద్: రాష్ట్ర రాజధానిని వాయుకాలుష్యం కమ్మేస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో 171 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతుండటం నగరవాసులను కలవరపెడుతోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6,000 మందికి పైగా మరణాలు సంభవించాయి.
లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది. పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపనుంది. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి.
వణుకుతున్న ఢిల్లీ.. పరేషాన్లో పట్నం
వాయుకాలుష్యం దేశ, రాష్ట్ర రాజధానులను వణికిస్తోంది. ఇవాళ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 408 పాయింట్లుగా నమోదు అయ్యింది. హైదరాబాద్ 171 పాయింట్లుగా ఉంది. ముఖ్యంగా న్యూ మలక్ పేటలో ఆందోళనకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ ఉంటుండం నగర జీవిని కలవర పెడుతోంది. ఇక్కడ 335 పాయింట్ల ఏక్యూఐతో సీవియర్ స్థితికి కాలుష్యం చేరడం ఆందోళన కలిగించే అంశం. నెల రోజులుగా గాలి నాణ్యత పడిపోతోందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిస్తోంది.
నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం.. వాహనాల రద్దీ పెరిగిపోవడం.. పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడం వల్లే గాలి నాణ్యత పడిపోతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అక్టోబర్ 17న హైదరాబాద్‌లో గాలి నాణ్యత మంచిగా ఉన్నట్టు గణంకాలు చెబుతున్నాయి. 31 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది. దాదాపు పక్షం రోజుల వ్యవధిలో భారీగా మార్పు చెందింది. ఇవాళ ఉదయం 171 పాయింట్లతో నాణ్యత భారీగా పడిపోయింది.
ఏక్యూఐ లెక్కలు ఇవి
0–50 బాగుంది
51–100 పరవాలేదు
101–200 బాగా లేదు
201–300 ఆరోగ్యానికి హానికరం
301–400 ప్రమాదకర స్థాయి
401–500 అపాయమైన స్థితి
హైదరాబాద్ పరిస్థితి ఇది
న్యూ మలక్ పేట 355
కేపీహెచ్ బీ 225
సైదాబాద్ 218
సెంట్రల్ వర్సిటీ 207
జూపార్క్ 188
యూఎస్ కాన్సులేట్ 181
సోమాజిగూడ 179
కోటి 146
బంజారాహిల్స్ 142
మణికొండ 126
మాదాపూర్ 118
విఠల్ రావు నగర్ 108
పుప్పాలగూడ 105
షిర్డీసాయినగర్ 101