
- ఇరుకు గదులు... అరకొర సౌకర్యాలు
- జిల్లాలో 914 సెంటర్లు
- సొంతభవనాలున్నది 23 కేంద్రాలకే...
- అద్దె భవనాల్లో 641, వివిధ శాఖల భవనాల్లో 250
- కిరాయిలకే నెలకు రూ. 28 లక్షలు
- స్థలం చూపించాలన్న కేంద్రమంత్రి పట్టించుకోని అధికారులు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో మెజారిటీ అంగన్ వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేక పిల్లలు, టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, ఆరేండ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్ వాడీ సెంటర్లు అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లో సరైన సౌకర్యాలు, వెంటిలేషన్ లేక కొనసాగుతున్నాయి. పైగా, అద్దె భవనాలకు సరిగ్గా కిరాయిలు చెల్లించకపోవడంతో టీచర్లే తమ జీతాల్లోంచి కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా అంగన్ వాడీ కేంద్రాల్లో చేరే పిల్లల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గ ఫెసిలిటీస్మాత్రం కల్పించడం లేదు.
కిరాయి బిల్డింగుల్లో 641 సెంటర్లు...
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా వీటి పరిధిలో 914 అంగన్ వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటిలో 1.70 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు కూడా సేవలు పొందుతున్నారు. 914 సెంటర్లలో మొత్తంగా 23 సెంటర్లకు మాత్రమే పక్కా భవనాలుండగా, మరో 250 సెంటర్లు జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ స్కూళ్ల బిల్డింగులు, ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. 641 సెంటర్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
వీటికి నెలకు సుమారు రూ. 28 లక్షల వరకు అద్దె కట్టాల్సి వస్తున్నది. కమ్యూనిటీ హాళ్లలో నిర్వహించే సెంటర్లకు నెలకు రూ. 750 కడుతున్నారు. ఇలా నెలకు లక్షల్లో అద్దెలు చెల్లిస్తూ అరకొర సౌకర్యాలతో నెట్టుకువస్తున్నారు. దీనికి బదులు సొంత స్థలాల్లో పక్కా భవనాలు నిర్మిస్తే రెంటు భారం తప్పడంతో పాటు మిగతా సమస్యలు తీరతాయని టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు అంటున్నారు.
కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా...
గత జనవరిలో జరిగిన దిశా మీటింగ్ లో స్కూళ్లకు, అంగన్ వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన జిల్లా అధికారులు స్థలం చూపిస్తే సెంటర్ల నిర్మాణానికి కేంద్రం తరఫున సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు దీనిపై జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ దృష్టి సారించలేదు. ఒకవైపు అంగన్ వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించగా, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.