టెక్నాలజీ : డిమెన్షియా కోసం స్మార్ట్​ వాచ్

టెక్నాలజీ : డిమెన్షియా కోసం స్మార్ట్​ వాచ్

దేశంలో తొలిసారిగా ఏఐ ఎనేబుల్డ్ ‘డిమెన్షియా కేర్ ఎట్ హోం’ను మొదలుపెట్టింది ఓ సంస్థ. వయసు పైబడే కొద్దీ మతిమరుపు రావడం సహజం. అయితే, ఇందులో డిమెన్షియా అనేది పెద్ద సమస్య. వృద్ధుల్లో ఈ పరిస్థితి చాలా సాధారణంగా కనిపిస్తుంది. అలాంటి వాళ్లకు సాయంగా ఉంటుందని స్మార్ట్​ వాచీని​ తీసుకొచ్చింది అన్వయ అనే సంస్థ. వాచీ​ పేరుతోనే పేటెంట్​ పొందింది.

ఈ వాచీ​ వాడడం వల్ల మతిమరుపుతో బాధపడే వృద్ధులు బయట ఎక్కడున్నా ట్రాక్ చేయొచ్చు. అంతేకాకుండా వాళ్లకేదైనా జరిగితే కూడా వెంటనే ఆ సమాచారం వాళ్ల సంబంధీకులకు వెళ్తుంది. 

మనదగ్గరే..

ఈ డివైజ్​ కోసం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. ఎంతకాలమో ఎదురుచూడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో అందుబాటులో ఉంది. “వృద్ధులకు సేవలు అందించాలనే ధ్యేయంతో సంస్థను మొదలుపెట్టాం. బెంగళూరు, చెన్నై వంటి 40 నగరాల్లో మా సంస్థ సేవలు అందిస్తోంది. డిమెన్షియా కేర్ రంగంలో వృద్ధులకు ఎన్నో సర్వీసులు అవసరం.

అందులో భాగంగా దేశంలో తొలిసారిగా ఏఐ ఎనేబుల్డ్ ‘డిమెన్షియా కేర్ ఎట్ హోం’ మొదలుపెట్టాం” అని ఆ సంస్థ ఫౌండర్​ ప్రశాంత్​ రెడ్డి చెప్పారు. ఇదే కాకుండా ఉద్యోగుల సేఫ్టీ కోసం ఏఐ ప్లాట్​ ఫాం ‘అనన్య నిశ్చింత్’​, రిమోట్​ పేషెంట్​ మానిటరింగ్ సిస్టం కోసం ‘అనన్య కిన్ కేర్’ సర్వీసులు కూడా అందిస్తున్నారు వీళ్లు.