హైదరాబాద్ విశ్వనగరం దిశగా పరుగులు పెడుతోంది. మహానగరం దినదినాభివృద్ధి చెందుతూ మరింత విస్తరిస్తోంది. ఆకాశాన్నంటేలా ఎత్తైన భవనాలతో వెలుగు జిలుగులు వెదజల్లుతోంది. హైటెక్ సిటీ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు ఇక్కడ కార్యాలయాలు నెలకొల్పుతున్నాయి. సైబర్ సిటీలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఎకరా ధర ఏకంగా వంద కోట్లు పలుకుతోంది. ఒక్కో లగ్జరీ ఫ్లాట్ రూ.20కోట్లకు పైనే ఉంది. అటు రాష్ట్ర రాజధానిగా.. తెలంగాణకు గుండెకాయగా మారింది మహానగరం. తెలంగాణ జనాభాలో దాదాపు పావువంతు ఇక్కడే నివాసం ఉంటున్నారు. కోటికిపైగా జనాభాతో నగరం కిటకిటలాడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ తదితర సౌకర్యాలతో దేశంలోని మిగతా మెట్రో నగరాలతో భాగ్యనగరం పోటీ పడుతోంది. దేశరాజధాని ఢిల్లీకి ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తోంది. భవిష్యత్ లో అన్ని నగరాల కంటే ముందు వరుసలో నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ రెండో రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
నెహ్రూ కాలంలోనే..
హైదరాబాద్ లేదా సికింద్రాబాద్‌ను రెండో రాజధానిగా మార్చాలనే ప్రతిపాదన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో కూడా వచ్చింది. తొలి ప్రధాని పండిట్ జవహల్ లాల్ నెహ్రూూ వద్ద ఈ విషయం చర్చకు వచ్చింది. రెండో రాజధానిగా మార్చేందుకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఢిల్లీతో పోలిస్తే భద్రతాపరంగా దేశానికే రక్షణ కవచంగా హైదరాబాద్ ఉంటుందని ఆనాడే గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరం పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా చైనా సరిహద్దుకు కేవలం 500 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో రాజధానితో పాటు రెండో రాజధాని కూడా ఉంటే బాగుంటుందనేది జవహర్ లాల్ నెహ్రూ ఆనాడే అనుకున్నారు.1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కాకపోవడంతో నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు అప్పటి హోంశాఖ మంత్రి సర్ధార్ పటేల్ నిజాం పాలకులపై సైనిక చర్యకు దిగటంతో హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సంగతి ఒక చరిత్ర. సైనిక చర్య అనంతరం దేశానికి రెండో రాజధాని అవసరాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అంతటితో ఆగకుండా ఆనాటి కేంద్ర మైన్స్ , పవర్ అండ్ వర్క్స్ శాఖ మంత్రి విఎన్ గాడ్గిల్‌ను మహారాష్ట్రలోని నాసిక్, హైదరాబాద్ స్టేట్‌లోని సికింద్రాబాద్‌ను సందర్శించాలని పంపించింది. నాసిక్ కంటె కూడా సికింద్రాబాద్ అయితేనే అనువైన ప్రదేశమని గాడ్గిల్ కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత పట్టించుకునే వారు లేనందున ఈ అంశం మూలకు పడింది. 1950 లో అంబేద్కర్ రెండో రాజధాని అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. అందుకు హైదరాబాద్ అయితేనే బాగుంటుందని కూడా సూచించారు. అంతేగాక అదే ఏడాది తాను రాసిన థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకంలో కూడా హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయని అంబేద్కర్ ప్రస్తావించారు. ముఖ్యంగా పాకిస్తాన్ , చైనా సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉంది. దీనివల్ల భద్రతా పరంగా అనువైన ప్రాంతం.., రాజధానిగా అభేద్యమైన కోటగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం అన్ని సీజన్‌లలో సౌకర్యంగా ఉంటుంది. భిన్నసంస్కృతులకు నిలయమని, తెలుగు, ఉర్దూ, హిందీ భాషలు మాట్లాడే వారు ఉన్నందున హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని ఆయన ప్రతిపాదించారు.
భిన్నాభిప్రాయాలు
అంబేద్కర్ ఈ ప్రస్తావన చేసిన చాలా కాలం తర్వాత 2013 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రా ప్రాంతం నుంచి డిమాండ్లు వచ్చాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే సహించే ప్రసక్తిలేదని తెలంగాణ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. రెండు ప్రాంతాలు భిన్నస్వరాలు వినిపించడంతో కేంద్రంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కనబెట్టింది. మళ్లీ శుక్రవారం ప్రకాశ్ అంబేద్కర్ హైదరాబాద్ రెండో రాజధాని అంశాన్ని ప్రతిపాదించడంతో మరోమారు చర్చకు వచ్చింది. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే ఇలాంటి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అలాగే దేశానికి రెండో రాజధానిగా పాలన సాగిస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక సార్లు బీజేపీ నేతల నోట రెండో రాజధాని అనే మాట వినిపించింది. అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. గతంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వంటి నేతలు రెండో రాజధాని అంటూ వ్యాఖ్యలు చేశారు. దానిపై తీవ్ర చర్చ జరిగింది.
వ్యతిరేకత తగ్గింది, ఆమోదనీయత పెరిగింది
హైదరాబాద్ ఇప్పటికే మహానగరంగా విస్తరించింది. దేశానికి రెండో రాజధాని అయితే ఇక ఆ పరుగును ఊహించడం కూడా కష్టమే. అందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఢిల్లీ ఇంక విస్తరణకు కూడా అవకాశం లేదు. కానీ, భాగ్యనగరం గ్రేటర్ పరిధితో పాటు ఇంకా చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరించేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. రక్షణ పరంగా ఇప్పటికే కంటోన్మెంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ కొలువై ఉన్నాయి. యూటీ కాకుండా యధావిధిగా రెండో రాజధాని ఏర్పాటు చేస్తే పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చు. దక్షిణాది రాష్ట్రాలకు రాజధాని సేవలు చేరువవుతాయి.
ఢిల్లీ కాలుష్యమూ ఓ కారణమే!
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కాలుష్యంతో నిండిపోయింది. అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలోనూ చేరిపోయింది. ఓవైపు వాహన కాలుష్యం.. మరోవైపు పొగమంచుతో చలికాలంలో జనం ఊపిరి కూడా పీల్చుకోలేక పోతున్నారు. విపరీతమైన రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయి. సమీప ప్రాంతాల్లోని పంజాబ్, హర్యానా రైతులు పంట పొలాల్లోని వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం మరింత పెరిగిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. హైదరాబాద్ ను రెండో రాజధాని చేయడం వల్ల హస్తినపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. మహానగరంపై భారం తగ్గి కొంత కోలుకుని ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్రకాశ్ అంబేద్కర్ తాజా ప్రకటనతో మరోసారి చర్చలోకి..
దేశ సరిహద్దుల్లో తరచూ ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలన్న అంశంపై యావద్దేశం దృష్టి సారించింది. డా. బీఆర్ అంబేద్కర్ హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చూడాలని అనుకున్నారని, 60 ఏళ్లయినా ఈ ప్రతిపాదన అమలులోకి రాలేదని అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్‌లో ఇటీవల అంబేద్కర్ జయంతి రోజున ప్రకటించడం మరోసారి చర్చకు దారి తీసింది. ఈ అంశాన్ని ఎవరో సాధారణ వ్యక్తి ప్రతిపాదిస్తే పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు కానీ, అంబేద్కర్ మనవడే చెప్పడంతో కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆనాడు అంబేద్కర్ హైదరాబాద్‌ను పలుమార్లు సందర్శించిన సందర్భంగా ఇక్కడి వాతావరణం ఆయనను కట్టిపడేసిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు కేంద్ర స్థానంలో ఉండటంతో రెండో రాజధానిగా చేయాలని తన పుస్తకంలో కూడా రాశారని ప్రకాష్ అంబేద్కర్ వేలాదిమంది ప్రజల హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు. హైదరాబాద్ రెండోరాజధానిగా మారాలని కోరుకుంటున్నానని కూడా ఆయన అన్నారు.