కూతురికి విషమిచ్చిన తల్లి.. నరాల వ్యాధితో దెబ్బతిన్న తల్లి ఆరోగ్యం.. తాను చనిపోతే పాప అనాథ అవుతుందని..

కూతురికి విషమిచ్చిన తల్లి.. నరాల వ్యాధితో దెబ్బతిన్న తల్లి ఆరోగ్యం.. తాను చనిపోతే పాప అనాథ అవుతుందని..
  • కూతురికి విషమిచ్చిన తల్లి
  • ఆపై తానూ తాగి ఆత్మహత్యాయత్నం
  • చికిత్స పొందుతూ చిన్నారి మృతి.. ఐసీయూలో తల్లి
  • హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన
  • నరాల వ్యాధితో దెబ్బతిన్న తల్లి ఆరోగ్యం
  • సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం
  • తాను చనిపోతే పాప అనాథ అవుతుందని అఘాయిత్యం

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం గాజుల రామారంలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను కత్తితో నరికి చంపిన ఘటన మరవక ముందే ప్రగతినగర్​లో మరో తల్లి తన కూతురికి విషమిచ్చి చంపింది. ఆపై తాను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన బాచుపల్లిలో జరిగింది. బాచుపల్లి సీఐ ఉపేందర్​ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన నంబూరి కృష్ణపావని(33), సాంబశివరావు దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలసవచ్చారు. బాచుపల్లిలో ప్రగతి నగర్ లోని ఆదిత్య గార్డెన్ లో​ఓ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కూతురు జశ్విక (5) ఉంది. సాంబశివరావు  సాఫ్ట్​వేర్​ఇంజినీర్  కాగా..​ కృష్ణపావని హౌజ్​వైఫ్.

కృష్ణపావని గత కొంతకాలంగా నరాల వ్యాధితో బాధపడుతోంది. తరచూ తన అనారోగ్యంపై ఆందోళన చెందుతోంది. ఆందోళన ఎక్కువై  అనారోగ్యం కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులు పడలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే తన కూతురు అనాథగా మారుతుందని భావించింది. దీంతో కూతురుని చంపి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్  అయింది. ఈనెల 18న భర్త ఆఫీసులో ఉండగా సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎలుకల మందును కూల్​డ్రింక్​​లో కలిపి జశ్వికకు తాగించింది. అనంతరం తానూ  తాగింది.  తాము ఎలుకమందు తాగిన విషయాన్ని భర్తకు తెలియకుండా జాగ్రత్త పడింది.

రాత్రి ఇంటికి వచ్చిన సాంబశివరావు..  పాప ఇబ్బంది పడుతుండగా ప్రశ్నించడంతో  ఫుడ్​ పాయిజన్​ అయిందని కృష్ణపావని అబద్ధం చెప్పింది. మరుసటి రోజు ఉదయం సాంబశివరావుకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించడంతో విషం తాగినట్లు తెలిపింది. దీంతో అతడు వెంటనే భార్య, కూతురిని కేపీహెచ్​బీలోని ఓ ప్రైవేట్ ​హస్పిటల్​కి తీసుకెళ్లాడు. భార్యను ఐసీయూలో అబ్జర్వేషన్ లో​ఉంచారు. జశ్విక పరిస్థితి విషమించడంతో సాయంత్రం 6.30 గంటలకు రెయిన్​బో చిల్డ్రన్​ హస్పిటల్​కి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జశ్విక శనివారం రాత్రి మృతి చెందింది. పాప మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.