బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరార్

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరార్
  • గుండుకు రూ.200, బ్రష్​కు రూ.20‌‌ చొప్పున వసూలు
  • జడీబూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం
  • ఓల్డ్​సిటీకి రావడంతో క్యూ కట్టిన వందలాది మంది బాధితులు
  • బెడిసి కొట్టిన ట్రీట్​మెంట్.. గుండుపై కురుపులు
  • హాస్పిటల్​ పాలైన బాధితులు.. పరారీలో నిందితుడు

హైదరాబాద్​ సిటీ / చార్మినార్, వెలుగు: వారం రోజుల్లో బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని చెప్పి చివరికి ఉన్న జుట్టు ఊడిపోయేలా చేసిన ఘటన హైదరాబాద్​లోని ఫతేదర్వాజలో చోటు చేసుకున్నది. వందలాది మంది గుండుపై కెమికల్ పూయడంతో రియాక్షన్ అయి పలువురు హాస్పిటల్ పాలయ్యారు. సదరు వ్యక్తి గుండుకు రూ.200, బ్రష్​కు రూ.20 చొప్పున వసూలు చేశాడు. రియాక్షన్ అయిన విషయం తెలుసుకుని దుకాణం బంద్ చేసి పరారయ్యాడు. 

జడీ బూటీ పేరుతో అందరికీ పేను కొరుకుడు మందు పూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఢిల్లీకి చెందిన వకీల్ సల్మానీ, 2013 నుంచి హెయిర్ కట్ పనిచేస్తున్నాడు. బిగ్‌‌బాస్ ఫేమ్‌‌కు కూడా తాను బట్టతలపై జుట్టు మొలి పించానని చెప్పుకొచ్చాడు. ఆ ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌‌ అయ్యాయి. తాను ఏప్రిల్‌‌ 6న హైదరాబాద్‌‌ వస్తున్నానని చెప్పాడు. తన ఫ్రెండ్​కు హైదరాబాద్‌‌ పాతబస్తీలో సెలూన్‌‌ షాపు ఉందని, అక్కడికి వస్తే బట్టతల బాధితుల సమస్య పరిష్కరిస్తానని తన సోషల్‌‌ మీడియా ద్వారా ప్రకటించాడు. చెప్పినట్టుగానే వకీల్‌‌ ఆదివారం హైదరాబాద్‌‌కు వచ్చాడు. బట్టతలపై జుట్టు మొలుస్తుందనే ఆశతో వందలాది మంది వకీల్‌‌ చెప్పిన సెలూన్‌‌ షాపు ముందు క్యూ కట్టారు.

బ్రష్​తో కెమికల్ రుద్ది..

సెలూన్ షాప్​కు వచ్చిన వారందరినీ ముందుగా లైన్​లో నిలబెట్టాడు. తలపై జడీబూటీ పూయాల్సి ఉంటుందని, ముందుగా అందరూ గుండు కొట్టుకోవాలని చెప్పాడు. బయట సెలూన్ షాప్​లో గుండు చేసుకుంటే సాధారణంగా రూ.50 తీసుకుంటారు. కానీ.. వకీల్ మాత్రం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.200 వసూలు చేశాడు. గుండు చేసుకున్న వారందరూ 20 రూపాయల బ్రష్ పట్టుకుని క్యూ పద్ధతిలో వకీల్ వద్దకు వచ్చారు. ఒక్కొక్కరిని చైర్​లో కూర్చోబెట్టిన వకీల్.. బ్రష్​తో గుండుపై కెమికల్ రుద్దడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇలా సుమారు వందలాది మంది గుండు చేయించుకుని మరీ కెమికల్ పూసుకున్నారు.

గుండుపై నీళ్లుచల్లుతూ ఉండాలి!

జడీ బూటీ పూశాక గుండు ఆరకూడదని షరతు విధించాడు. ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలని చెప్పాడు. గుండుపై బట్టకట్టుకుని ఉండాలన్నాడు. 5 రోజుల వరకు చల్లటి నీళ్లతోనే స్నానం చేయాల ని కండీషన్ పెట్టాడు. స్నానం చేస్తున్నప్పు డు కండ్లు మూసుకోవాలని షరతు విధిం చాడు. ఇలా.. ఆదివారం పొద్దున గుం డుపై జడీ బూటీ పోసుకుని వెళ్లిన వారిలో చాలా మందికి సాయం త్రంకల్లా రియా క్షన్ మొదలైంది. తల మంట పుట్టడంతో తీవ్ర ఇబ్బందిపడ్డారు. తర్వాత పెద్ద పెద్ద బొబ్బలు వచ్చాయి. ఏం చేయాలో తెలియ క బాధితులంతా దగ్గర్లోని హాస్పిటల్​కు పరుగులు పెట్టారు. గుండు గీసి కెమికల్స్ రాయడం వల్లే ఇన్​ఫెక్షన్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. దీంతో బాధితులంతా సోమవారం వకీల్​ను నిలదీసేందుకు సిద్ధ మయ్యారు. కానీ.. అతను మాత్రం విష యం ముందే తెలుసుకుని మూటముల్లె సర్దుకుని పరారయ్యాడు. కాగా, ఈ ఘటనపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తున్నది.